గుడ్ బై చెప్పిన వారెన్ బఫెట్..!!
ఒరాకిల్ ఆఫ్ ఒహామాగా ప్రఖ్యాతి చెందిన దిగ్గజ వ్యాపారవేత్త, ప్రముఖ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. బెర్క్‌షైర్ హాథ్ వే ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుండి వైదొలిగారు. దీంతో కార్పొరేట్ చరిత్రలో ఓ అసాధారణమైన నాయకత్వ శకానికి తెర పడినట్టయింది. 95 ఏళ్ల బఫెట్.. దాదాపు ఆరు దశాబ్దాల పాటు బెర్క్ షైర్ హాథ్ వేను నడిపించారు. ఈ సంస్థను ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలిపారు.
1965లో బెర్క్‌షైర్ హాథ్ వే తన నియంత్రణలోకి తీసుకున్న బఫెట్.. మొదట టెక్స్‌టైల్ వ్యాపారాన్ని నిలబెట్టాలని చూశారు. ఆ తర్వాత క్రమంగా మూలధనాన్ని బీమా, రైల్వేలు, యుటిలిటీ, వివిధ బ్రాండింగ్స్, ఈక్విటీల్లోకి మళ్ళించారు. అత్యుత్తమ పెట్టుబడిదారుల్లో ఒకరిగా ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చుకున్నారు. బెర్క్‌షైర్ హాథ్ వే నుంచి బయటికి రావడం ఇదే తొలిసారి. 60 సంవత్సరాల పాటు ఆ సంస్థలో వేర్వేరు హోదాల్లో పనిచేశారాయన.

సీఈఓగా రాజీనామా చేసినప్పటికీ ఛైర్మన్ గా కొనసాగుతారని బెర్క్ షైర్ తెలిపింది. బఫెట్ సారథ్యంలో బెర్క్‌షైర్.. ఆపిల్, కోకా కోలా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి దిగ్గజ కంపెనీలలో ప్రధాన భాగస్వామిగా కొనసాగుతోంది. బీఎన్ఎస్ఎఫ్ రైల్వే, గెయికో, బెర్క్‌షైర్ హాథ్ వే ఎనర్జీ సహా అనేక అనుబంధ సంస్థలు బెర్క్ షైర్ పరిధిలో ఉన్నాయి. వారెన్ బఫెట్ స్థానంలో గ్రెగ్ అబెల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన బెర్క్‌షైర్ హాథ్ వే కంపెనీ నాన్-ఇన్సూరెన్స్ కార్యకలాపాల విభాగం వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తోన్నారు.
ఈ నెల 30వ తేదీ నాటికి వారెన్ బఫెట్ నికర ఆస్తి 149 బిలియన్ డాలర్ల పైమాటే. 1958లో 31,500 డాలర్లకు కొనుగోలు చేసిన నెబ్రాస్కాలోని ఒమాహాలో గల తన పాత ఇంట్లోనే ఆయన ఇప్పటికీ నివసిస్తున్నారు. ఇక ముందు కూడా అక్కడే ఉండబోతున్నారు కూడా. బెర్క్‌షైర్ హాథ్ వేను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆ కంపెనీ స్టాక్ ధర అంచనా ప్రకారం 3,950,000 శాతానికి పైగా పెరిగిందని మీడియా తెలిపింది.












Click it and Unblock the Notifications