ఒకే ట్రిప్.. 3 టూరిస్ట్ ప్లేసెస్! 2026 ఇయర్ ఎండ్ బెస్ట్ ప్లాన్ ఇదే!
సాధారణంగా ఏడాది చివర్లో వచ్చే సెలవుల కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. రోజువారీ ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్త విరామం తీసుకుని, కుటుంబ సభ్యులతోనో.. స్నేహితులతోనో కొత్త ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటారు. కొండలపై మంచు అందాలను చూడాలని కొందరు ఆశపడితే.. చలికి దూరంగా సముద్ర తీరాల్లో సేదతీరాలని మరికొందరు కోరుకుంటారు.
కానీ ఇంకొందరికి మాత్రం చారిత్రక కట్టడాలు, అడవులు, ప్రకృతి అందాల మధ్య గడపడమే ఇష్టం. అయితే సమయం తక్కువగా ఉన్నప్పుడు ఒకే ప్రాంతంలో రోజులు గడపడం కంటే.. దగ్గరదగ్గరగా ఉన్న పర్యాటక ప్రదేశాలను కలుపుకుని ప్రయాణిస్తే మరిన్ని అనుభూతులను సొంతం చేసుకోవచ్చు. ఈ శీతాకాలంలో ఐదు రోజుల సమయం కేటాయిస్తే చుట్టి రావడానికి వీలైన ఐదు ప్రత్యేక పర్యాటక మార్గాలు మీకోసం..

1. రాజస్థాన్..
రాజస్థాన్ పేరు వినగానే గుర్తొచ్చేది రాజుల కోటలు, రంగురంగుల వీధులు, ఒంటెల ప్రయాణాలు, విస్తారమైన ఇసుక దిబ్బలు. చలికాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఐదు రోజుల పర్యటనలో జోధ్‌పూర్, జైసల్మేర్, సామ్ ఇసుక దిబ్బలను కలిపి చూడొచ్చు. మొదటి రెండు రోజులు జోధ్‌పూర్‌లో గడపండి. ఆకాశాన్ని తాకేలా కనిపించే మెహ్రాన్‌గఢ్ కోటను సందర్శించడంతో పాటు, నీలిరంగు ఇళ్లతో ప్రత్యేకంగా కనిపించే పాత నగర వీధుల్లో నడవొచ్చు. తోర్జీ కా ఝల్రా మెట్ల బావి వద్ద కొంతసేపు ప్రశాంతంగా గడిపి, స్థానికంగా ప్రసిద్ధి చెందిన మావా కచోరీ రుచిని ఆస్వాదించవచ్చు.
తర్వాతి రెండు రోజులు జైసల్మేర్‌కు కేటాయించండి. పసిడి రంగులో మెరిసిపోయే సోనార్ ఖిలాను సందర్శిస్తే రాజస్థాన్ చరిత్ర, వాస్తుశిల్పం కళ్లముందు కనిపిస్తాయి. ఇప్పటికీ ప్రజలు నివసించే ప్రత్యేక కోటల్లో ఇదొకటి. రాతిపై అద్భుతమైన చెక్కడాలతో ఆకట్టుకునే పట్వోన్ కీ హవేలీ, ప్రశాంతమైన గడిసర్ సరస్సు కూడా చూడదగ్గ ప్రదేశాలు. చివరి రోజు సాయంత్రం నగరానికి సుమారు గంట ప్రయాణ దూరంలో ఉన్న సామ్ ఇసుక దిబ్బలకు చేరుకోవచ్చు. అక్కడ ఒంటెపై ఎడారి సవారీ, జీపులతో ఇసుక దిబ్బలపై చేసే ప్రయాణం పర్యాటకులకు కొత్త అనుభూతినిస్తాయి. రాత్రి ఎడారి శిబిరంలో భోజనం చేస్తూ, మంటల చుట్టూ కూర్చుని కల్బేలియా జానపద నృత్యాలను ఆస్వాదిస్తే ఈ ప్రయాణం మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
2. హిమాచల్ ప్రదేశ్..
చలికాలంలో మంచు అందాలను చూడాలనుకునే వారికి హిమాచల్ ప్రదేశ్ మంచి ఎంపిక. ఐదు రోజుల పర్యటనలో మనాలి, కసోల్, తోష్ ప్రాంతాలను చుట్టిరావచ్చు. మొదటి రెండు రోజులు మనాలిలో గడపండి. మంచుతో కప్పుకున్న ఎత్తైన ప్రాంతాలను చూడాలంటే అటల్ టన్నెల్ మీదుగా ప్రయాణించవచ్చు. ఓల్డ్ మనాలిలోని చెక్క ఇళ్లతో కూడిన వీధులు, చిన్నచిన్న కేఫ్‌లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. వశిష్ఠ్ ప్రాంతంలోని సహజ వేడి నీటి బుగ్గలను కూడా సందర్శించవచ్చు. మంచు కొండల మధ్య వేడి నీటి స్నానం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.
తర్వాతి రెండు రోజులు పార్వతి నది ఒడ్డున ఉన్న కసోల్‌లో గడపొచ్చు. నది ప్రవాహాన్ని చూస్తూ ప్రశాంతంగా కూర్చోవడం, స్థానిక కేఫ్‌లలో ఆపిల్ పై వంటి వంటకాలను రుచి చూడటం ఈ ప్రాంత ప్రత్యేకత. అక్కడి నుంచి చలాల్ గ్రామం వైపు చిన్న నడక ప్రయాణం చేస్తే ప్రకృతి అందాలను మరింత దగ్గరగా చూడవచ్చు. చివరి రోజు లోయ చివరన ఉన్న తోష్ గ్రామానికి వెళ్లండి. మంచు తాకిన చిన్నచిన్న దారుల్లో నడుస్తూ, కొండ అంచున ఉన్న కేఫ్‌లో వేడి అల్లం, నిమ్మ, తేనె టీ తాగుతూ సాయంత్రం సూర్యాస్తమయాన్ని వీక్షించవచ్చు. చుట్టూ కనిపించే మంచు శిఖరాలు ఈ ప్రయాణానికి మరింత అందాన్ని చేకూరుస్తాయి.
3. గుజరాత్..
చలికాలంలో మంచు ప్రాంతాలకు వెళ్లడం ఇష్టం లేనివారు ఎండ, సముద్ర గాలి మధ్య విహరించాలనుకుంటే గుజరాత్‌ను ఎంచుకోవచ్చు. సముద్ర తీరాలు, చారిత్రక ఆలయాలు, వన్యప్రాణుల ప్రపంచం.. ఇలా భిన్నమైన అనుభూతులను ఒకే పర్యటనలో పొందవచ్చు. ఐదు రోజుల్లో డయ్యూ, సోమనాథ్, గిర్ ప్రాంతాలను సందర్శించేలా ప్రణాళిక వేసుకోవచ్చు. మొదటి రెండు రోజులు డయ్యూలో గడపండి. సముద్రం ఒడ్డున ఉన్న భారీ డయ్యూ కోటను సందర్శించడంతో పాటు, ప్రకృతి సహజంగా రూపొందించిన నైడా గుహలను చూడొచ్చు. ప్రశాంతమైన ఘోఘ్లా బీచ్‌లో సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ కొంతసేపు విశ్రాంతి తీసుకోవచ్చు.
తర్వాతి రెండు రోజులు సోమనాథ్‌కు వెళ్లండి. సముద్ర తీరాన వెలసిన ప్రసిద్ధ సోమనాథ్ ఆలయంలో సాయంత్రం జరిగే హారతి భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయ పరిసరాల్లోని సముద్ర తీర మార్గంలో నడుస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఆలయ చరిత్రను వివరించే లైట్ అండ్ సౌండ్ షో కూడా చూడదగ్గది. చివరి రోజు గిర్ జాతీయ పార్కుకు చేరుకోవచ్చు. ఆసియా ఖండంలో సహజ వాతావరణంలో సింహాలను చూడగలిగే అరుదైన ప్రాంతాల్లో గిర్ ఒకటి. ముందస్తుగా అనుమతి తీసుకుని ఓపెన్ జీప్ సఫారీకి వెళ్తే అడవిలో స్వేచ్ఛగా సంచరించే ఆసియా సింహాలను చూసే అవకాశం ఉంటుంది. అక్కడి అడవులు, వన్యప్రాణులతో పాటు స్థానిక మాల్ధారీ సముదాయం జీవన విధానాన్ని కూడా తెలుసుకోవచ్చు.
4. ఉత్తరాఖండ్..
ఆధ్యాత్మికత, సాహస క్రీడలు, కొండ ప్రాంతాల అందాలు.. అన్నీ కలగలిసిన పర్యటన కావాలంటే ఉత్తరాఖండ్ మంచి ఎంపిక. ఐదు రోజుల్లో రిషికేశ్, ముస్సోరీ, ధనౌల్టీ ప్రాంతాలను సందర్శించవచ్చు. మొదటి రెండు రోజులు రిషికేశ్‌లో గడపండి. త్రివేణి ఘాట్ వద్ద సాయంత్రం జరిగే గంగా హారతి చూడటం మరిచిపోలేని అనుభూతి. సాహస క్రీడలపై ఆసక్తి ఉన్నవారు వాతావరణం, నది ప్రవాహ పరిస్థితులు అనుకూలిస్తే గంగా నదిలో రివర్ రాఫ్టింగ్ చేయవచ్చు. అడవుల మధ్య ప్రశాంతంగా ఉండే బీటిల్స్ ఆశ్రమం కూడా సందర్శించదగ్గ ప్రదేశం.
తర్వాతి రెండు రోజులు ముస్సోరీకి వెళ్లండి. కేబుల్ కారులో గన్ హిల్ పైకి చేరుకుని చుట్టూ కనిపించే కొండల అందాలను వీక్షించవచ్చు. మాల్ రోడ్డులో నడుస్తూ వేడి మోమోలు, హాట్ చాక్లెట్ రుచులను ఆస్వాదించవచ్చు. లాల్ టిబ్బా నుంచి సూర్యాస్తమయ సమయంలో కనిపించే ప్రకృతి దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణ. చివరి రోజు ముస్సోరీకి సమీపంలోని ధనౌల్టీకి వెళ్లండి. ఎత్తైన పైన్ చెట్ల మధ్య ఉన్న ఎకో పార్కుల్లో నడుస్తూ ప్రకృతి ఒడిలో సేదతీరవచ్చు. వాతావరణం, రహదారి పరిస్థితులు అనుకూలిస్తే సుర్కండా దేవి ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు. అక్కడి నుంచి కనిపించే మంచు కొండల దృశ్యాలు పర్యటనకు మంచి ముగింపునిస్తాయి.
5. మహారాష్ట్ర..
చల్లని వాతావరణం, పచ్చని కొండలు, లోయలు, తాజా పండ్ల రుచులు ఇష్టపడేవారికి మహారాష్ట్రలోని పర్యాటక ప్రాంతాలు మంచి ఎంపిక. ఐదు రోజుల పర్యటనలో మహాబలేశ్వర్, పంచగని, లోనావాలా ప్రాంతాలను కలిపి చూడొచ్చు. మొదటి రెండు రోజులు మహాబలేశ్వర్‌లో గడపండి. ఈ సీజన్‌లో స్ట్రాబెర్రీ తోటలను సందర్శించి తాజా పండ్లను రుచి చూడవచ్చు. ఆర్థర్స్ సీట్ నుంచి కనిపించే లోయల అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. వెన్నా సరస్సులో బోటింగ్ చేస్తూ సాయంత్రాన్ని ప్రశాంతంగా గడపవచ్చు.
తర్వాతి రెండు రోజులు పంచగనికి వెళ్లండి. అగ్నిపర్వత శిలలతో ఏర్పడిన విశాలమైన టేబుల్ ల్యాండ్ ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. పురాతన రాజ్‌పురి గుహలను సందర్శించడంతో పాటు, మ్యాప్రో గార్డెన్‌లో పిజ్జాలు, పండ్లతో తయారుచేసిన జామ్‌లు, ఇతర రుచులను ఆస్వాదించవచ్చు. చివరి రోజు లోనావాలాకు చేరుకోండి. కార్లా, భాజా గుహల్లోని పురాతన రాతి నిర్మాణాలు, శిల్పకళను దగ్గరగా చూడొచ్చు. టైగర్స్ పాయింట్ నుంచి కనిపించే సూర్యాస్తమయం మరో ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రాంతానికి వచ్చినవారు స్థానికంగా ప్రసిద్ధి చెందిన చిక్కీ, హాట్ ఫడ్జ్ రుచులను కూడా ఆస్వాదించవచ్చు.
ప్రయాణానికి ముందే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఐదు రోజుల్లో మూడు ప్రాంతాలను చుట్టిరావాలంటే ముందస్తు ప్రణాళిక చాలా ముఖ్యం. ముఖ్యంగా హోటల్ గదులు, రవాణా సౌకర్యాలు, సందర్శన టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. మంచు కురిసే ప్రాంతాల్లో వాతావరణం, రహదారుల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. గిర్ వంటి జాతీయ పార్కుల్లో సఫారీకి ముందస్తు అనుమతులు అవసరం కావచ్చు. రిషికేశ్‌లో రాఫ్టింగ్ వంటి సాహస క్రీడలకు కూడా స్థానిక అధికారుల సూచనలు పాటించాలి. అలాగే ప్రయాణ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ప్రాంతంలో చూడాల్సిన ప్రదేశాలను ముందుగానే ఎంపిక చేసుకుంటే హడావుడి లేకుండా యాత్రను ఆస్వాదించవచ్చు.












Click it and Unblock the Notifications
