ఎడమొహం-పెడమొహం : షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోని హిల్లరీ, ట్రంప్
లాస్ వెగాస్ : అమెరికన్ ఎన్నికల్లో భాగంగా జరిగిన చివరి బిగ్ డిబేట్ లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ ల ప్రవర్తన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరి మధ్య కరచాలనం కాదు కదా.. కనీస చిరునవ్వు పలకరింపు కూడా లేకపోయింది. కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగానే వెనుతిరిగినట్లు సమాచారం.
ప్రసంగాలు మొదలుపెట్టే ముందు సభా సాంప్రదాయల ప్రకారం కరచాలనం చేసుకునే పద్దతిని ఇద్దరు పట్టించుకోలేదు. దీంతో ఒకరిపై ఒకరికి ఉన్న విముఖత ఈ సభా వేదికగా మరోసారి స్పష్టమైంది. కాగా, బుధవారం రాత్రి(భారత కాలమాన ప్రకారం గురువారం ఉదయం) లాస్ వెగాస్ లోని నెవాడా యూనివర్సిటీలో ఈ బిగ్ డిబేట్ జరిగింది.

90నిమిషాల పాటు జరిగిన డిబేట్ ను విభాగాలుగా విభజించి.. జాతీయ రుణాలు, ఆర్థిక వ్యవస్థ, సుప్రీం కోర్టు, ఫిలాసఫీలు, ప్రెసిడెంట్ ఫిట్ నెస్ తో పాటు తదితర అంశాలపై ఇద్దరికీ ప్రశ్నాస్త్రాలు సంధించారు క్రిస్ వాలెస్. పురుషులతో సమానంగా మహిళలందరికీ అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్బంగా హిల్లరీ హామి ఇచ్చారు.
ఇక మునుపటి డిబేట్స్ లాగే ఈ డిబేట్ లోను ఇద్దరి మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. పరస్పరం ఒకరిపై ఒకరు ఆధిక్యం కనబరచడానికి శతవిధాల ప్రయత్నించారు. బోయింగ్ 757 విమానం ద్వారా ట్రంప్ టీమ్ కార్యక్రమానికి హాజరవగా.. హిల్లరీ టీమ్ బోయింగ్ 737 విమానం ద్వారా కార్యక్రమానికి హాజరయ్యారు.
డ్రెస్సింగ్ విషయానికొస్తే.. హిల్లరీ క్లింటన్ వైట్ ప్యాంట్, వైట్ కోట్ ధరించగా, ట్రంప్ బ్లాక్ కోట్, వైట్ టీషర్టు, రెడ్ టై ధరించారు. ఇదిలా ఉంటే గత రెండు డిబేట్లలోను ట్రంప్ పై హిల్లరీ పైచేయి సాధించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 8న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications