Makara Sankranti : దేశంలోని వివిధ ప్రాంతాల్లో మకరసంక్రాంతిని పిలుచుకునే పేర్లు..
భారతదేశంలోని ప్రజలంతా ఎంతో వైభవంగా, సంప్రదాయంగా జరుపుకునే పండుగ మకర సంక్రాంతి. ఈ పండుగను దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. సూర్యుడు ధనుస్సు రాశిని విడిచి మకరరాశిలో ప్రవేశించిన పౌషా మాసంలో ఈ పండుగను ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీ. ఈ పండుగ జనవరిలో పద్నాలుగు లేదా పదిహేనవ తేదీన వస్తుంది. సూర్యుని ఉత్తరాయణ సంచారం కూడా ఈ రోజు నుండి ప్రారంభమవుతుందని చెబుతుంటారు. అందుకే సంక్రాంతి పండుగను కొన్ని ప్రాంతాలలో ఉత్తరాయణి అని కూడా పిలుస్తారు. సంక్రాంతి రోజు నుండి పగలు పొడవుగా మారడం ప్రారంభిస్తుంది. రాత్రులు తక్కువగా మారడం మనం చూడొచ్చు. దీంతో పాటు, ఈ పండుగ శీతాకాలం ముగింపుకు చిహ్నంగా కూడా పరిగణిస్తారు. మకర సంక్రాంతిని ప్రధానంగా రబీ పంటల పండగ సందర్భంగా జరుపుకుంటారు.
పెద్ద పండుగ, ఆంధ్రప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్‌లో సంక్రాంతి పండుగను మూడురోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమగా చేసుకుంటారు. మకర సంక్రాంతిని పెద్ద పండుగ అని కూడా అంటారు. ఈ రోజున మహిళలు ఇళ్ల ముందు రంగోలీని అలంకరించి పులిహోర, అరసెలు, బొబ్బట్లు, పరమాన్నం వంటి సంప్రదాయ వంటకాలను వండుతారు. ఇక, కుటుంబసభ్యులంతా ఓ చోట చేరి ఈ పండుగను నిర్వహించుకుంటారు.

మకరవిళక్కు, కేరళ
కేరళలో మకరసంక్రాంతి పండుగను మకరవిళక్కు అంటారు. శబరిమలలోని అయ్యపన్ ఆలయంలో మకర సంక్రాంతిని మకరవిళక్కుగా జరుపుకుంటారు. ఈ రోజున ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపును ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది ప్రజలు ఆలయానికి తరలివస్తారు.
దానోత్సవం, ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లో మకర సంక్రాంతి పండుగను దానోత్సవం అంటారు. మకర సంక్రాంతితో భూమిపై మంచి రోజులు ప్రారంభమవుతాయని ఇక్కడి ప్రజలునమ్ముతారు. మకర సంక్రాంతి రోజున తలంటూ స్నానం ఆచరించి తర్వాత దానాలు ఇచ్చే సంప్రదాయం ఇక్కడ ఎప్పటినుంచో ఉంది. ఈ రోజు గంగా ఘాట్‌లపై ప్రత్యేక జాతరలు కూడా నిర్వహిస్తారు.
లోహ్రీ.. పంజాబ్, హర్యానా
పంజాబ్, హర్యానాలలో జనవరి 15కి ఒక రోజు ముందు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అక్కడ దీనిని 'లోహ్రీ అని పిలుస్తారు. ఈ రోజు అగ్నిదేవుని పూజించేటప్పుడు నువ్వులు, బెల్లం, బియ్యం, కాల్చిన మొక్కజొన్నలను అగ్నిలో సమర్పిస్తారు. నవ వధువులకు, అప్పుడే పుట్టిన పిల్లలకు ఈ పండుగ ఎంతో ప్రత్యేకమని చెప్పుకోవాలి.
పౌష సంక్రాంతి, పశ్చిమ బెంగాల్
పశ్చిమబెంగాల్‌లో ఈ పండుగను పౌష సంక్రాంతిగా జరుపుకుంటారు. ఈ రోజున ఇక్కడ స్నానం చేసిన తర్వాత నువ్వులను దానం చేసే సంప్రదాయం ఉంది. గంగాసాగర్‌లో ప్రతి సంవత్సరం ఇక్కడ భారీ జాతరను నిర్వహిస్తారు.
సక్రత్, బీహార్
బీహార్‌లో మకర సంక్రాంతిని సక్రత్ లేదా 'ఖిచ్డీ పండుగ' అంటారు. ఈ పండుగ రోజు ప్రత్యేకంగా ఉరడ పప్పు, బియ్యం, నువ్వులు, ఖతాయ్, ఉన్ని బట్టలు దానం చేసే సంప్రదాయం ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతుంది.
బిహు, అస్సాం
అస్సాంలో సంక్రాంతి పండుగను మాగ్ బిహు, భోగాలీ బిహు అని పిలుస్తారు.
తమిళనాడు
తమిళనాడులో ఈ పండుగను 4 రోజుల పాటు జరుపుకుంటారు. ఇక్కడ మొదటి రోజుని 'భోగి పొంగల్' అని, రెండో రోజుని 'సూర్య పొంగల్', మూడో రోజుని 'మట్టు పొంగల్స, నాల్గవ రోజుని 'కన్యా పొంగల్' అని పిలుస్తారు.
ఉత్తరాయణ్, గుజరాత్
గుజరాత్‌లో సంక్రాంతి పండుగను ఉత్తరాయణ్ అని అంటారు. ఈ పండుగ సందర్భంగా గుజరాత్ 'గాలిపటాల పండుగ'కు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఉదయం పూజలు, దానధర్మాలు చేసిన తరువాత, గాలిపటాలు ఎగురవేయడం ఇక్కడ ఆనవాయితీ.
మకర సంక్రాంతి, రాజస్థాన్
రాజస్థాన్‌లో ప్రజలు సంక్రాంతి పండుగను మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా నువ్వులతో చేసిన లడ్డూలు, పకోడీలు వంటి వంటకాలను చేస్తారు. అంతే కాకుండా ఈ రోజున గాలిపటాలు ఎగురవేయడం కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.

గుగూటి, ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌లో, మకర సంక్రాంతిని ఉత్తరాయణి లేదా గుగూటి అని పిలుస్తారు. ఈ రోజున పూరీ, వడ, పువ్వలను గుగూటి (ఒక రకమైన వంటకం)గా చేస్తారు. ఈ ప్రాంతంలో ఈ పండుగను వలస పక్షులను స్వాగతించే పండుగగా పరిగణిస్తారు. ఈ రోజున ప్రజలు ఖిచ్డీ, ఇతర ఆహార పదార్థాలను దానంగా ఇస్తారు.
మాగ్ సాజిని, హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్‌లో సంక్రాంతిని మాగ్ సాజినిగా జరుపుకుంటారు. సాజి అనేది సంక్రాంతి ఇక్కడి స్థానిక పేరు. మాఘ అనేది మాసం పేరు. పండుగ రోజు ఇక్కడివారంతా పవిత్ర నదులలో స్నానాలు చేసి, దేవాలయాలను సందర్శిస్తారు. సాయంత్రం వేళ జానపద పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటారు.
మకర చౌలా, ఒడిశా
ఒడిశాలో సంక్రాంతిని మకర చౌలా అని పిలుస్తారు. దేవతలకు నైవేద్యాన్ని సమర్పించేందుకు మకర చౌలా లేదా ముడి బియ్యం, కొబ్బరి, బెల్లం, అరటిపండు, నువ్వులు, రాస్‌గోలా, ఖాయ్ హల్వాను సిద్ధం చేస్తారు. భక్తులు ఈ రోజున కోణార్క్ ఆలయంలో సూర్య భగవానుని పూజించడం ఇక్కడ ఆనవాయితీ.
సుగ్గి, కర్ణాటక
కర్ణాటకలో సంక్రాంతి పండుగను మకర సంక్రాంతి లేదా సుగ్గి అంటారు. ఇక్కడ కూడా రైతుల పండుగ అంటే పంట పండగగా భావిస్తారు. ఈ సందర్భంగా శనగపప్పు, కొబ్బరి బెల్లం కలిపి నువ్వులతో చేసిన వంటకాలతో తయారుచేస్తారు.
హుంగ్రై, త్రిపుర
త్రిపురలో సంక్రాంతి పండుగను హంగ్రాయ్ అని పిలుస్తారు. పవిత్రమైన గుమ్టి నదిలో పూర్వీకుల అవశేషాలను నిమజ్జనం చేసినందుకు గుర్తుగా త్రిపుర సంక్రాంతిని హంగ్రాయ్‌గా జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ.












Click it and Unblock the Notifications