క్లాస్ నుంచి తీసుకెళ్లి డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య: నరసరావుపేటలో ఉద్రిక్తత
గుంటూరు: జిల్లాలోని నరసరావుపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థిని కోట అనూష(19)న దారుణ హత్యకు గురైంది. తన తోటి విద్యార్థే ఆమెను హత్య చేశాడు. మరో యువకుడితో సన్నిహితంగా ఉంటుందనే నెపంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిందిత యువకుడు హత్య చేసిన అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు.

తోటి విద్యార్థి స్నేహంగా..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన కోట అనూష నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న తోటి విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కూడా కొంత కాలంగా స్నేహంగా ఉంటున్నారని తోటి విద్యార్థులు చెబుతున్నారు.

క్లాస్ నుంచి తీసుకెళ్లి దారుణం..
ఈ క్రమంలో బుధవారం ఉదయం అనూషను క్లాసు నుంచి బయటకు పిలిచి పాలపాడు రోడ్డులోని సాగర్ మేజర్ కాలువ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో గొడవపడ్డాడు. ఆ తర్వాత తీవ్ర ఆగ్రహానికి గురైన విష్ణువర్ధన్ రెడ్డి ఆమెను కాలువలోకి తోసేశాడు. ఆమె చనిపోయిన తర్వాత అతడే నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు లొంగిపోయాడు.

కాలువలో విద్యార్థిని మృతదేహం..
పాలపాడులోని సాగర్ మేజర్ కాలువలో అనూష మృతదేహం కనిపించడంతో.. స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఐడీ కార్డును గుర్తించి ఆ కాలేజీలో ఆరా తీశారు. ఆమె ఎవరన్నది గుర్తించి కుటుంసభ్యులకు, పోలీసులు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో కాలేజీలో కూడా గురించి విచారించారు.
అనూష చివరిసారిగా విష్ణువర్ధన్ రెడ్డితో కనిపించిందని కాలేజీ విద్యార్థులు చెబుతున్నారు. అనూషను బైక్‌పై విష్ణువర్ధన్ రెడ్డి తీసుకెళ్లాడని, ఆ తర్వాత కనిపించలేదని చెప్పారు.

నరసరావుపేటలో ఆందోళన.. ఉద్రిక్తత
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి దారుణ హత్యకు గురవడంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమె మృతదేహంతో బంధువులు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ, సీపీఐ, పలు సంఘాల నేతలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. సుమారు మూడు గంటలపాటు ఆందోళన కొనసాగించడంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నిందితుడ్ని తమకు అప్పగించాలంటూ బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.