డబుల్ బెడ్ రూంలోనే పది కుటుంబాలు ఉండాలా...? చిన్న దొర: షర్మిల
తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైరయ్యారు. డబుల్ బెడ్రూం ఇల్లు 10 ఇందిరమ్మ ఇళ్లతో సమానం అని కేటీఆర్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై షర్మిల స్పందించారు. ఒక డబుల్ బెడ్రూం ఇల్లు 10 ఇళ్లలో సమానమా? మరి 10 కుటుంబాలను ఒక డబుల్ బెడ్రూం ఇంట్లోనే కాపురం ఉండమని చెప్పకపోయారా చిన్న దొరా? అంటూ సెటైర్లు వేశారు.

ఉద్యోగం ఏవీ..?
కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వడం మీకు చేతకాదని షర్మిల విరుచుకుపడ్డారు. ఇంటికొక ఉద్యోగం ఇవ్వడం మీకు చేతకాదు. ఒక్కో దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వడం చేతకాదు. మీకు రుణమాఫీ చెయ్యడం చేతకాదు. మీకు వడ్డీ రహిత రుణాలు ఇవ్వడం చేతకాదు. మీకు వరి ధాన్యం కొనడం చేతకాదు కదా. పాలన మానేసి ధర్నాలే చేసుకోండి... రాజీనామా చేసి ఒక దళితుడిని సీఎం చేయాలని షర్మిల ధ్వజమెత్తారు.

కేసీఆర్‌పై ఫైర్
అంతకుముందు కేసీఆర్‌పై షర్మిల విరుచుకుపడ్డారు. ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే..? లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నాడు. లక్షా 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారని అడిగారు. ఇంకో 80 వేలు మళ్లీ ఇచ్చేస్తానని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నాడు. 80 వేల ఉద్యోగాలు ఏమిటి..? పీఆర్సీ ప్రకారం 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం లక్ష 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. పీఆర్సీ ప్రకారం లక్ష 91వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఉద్యోగాలకు కూడా కేంద్రమే ఆలస్యం చేస్తోందని కేసీఆర్ చెబుతున్నాడు.

నోటిఫికేషన్లు ఏవీ..?
అయ్యా కేసీఆర్ కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసి 4 ఏండ్లు అయిపోయింది కదా..? ఇప్పటి వరకు మీరు దానికి కావాల్సిన నోటిఫికేషన్లు, సిబ్బందిని ఎందుకు భర్తీ చేయలేదు అని అడిగారు. ఆలస్యం చేస్తున్నది మీరా..ఇంకెవరైనా..? ఉద్యోగాలు ఇవ్వాలని మీకు సోయి ఉంటే వీల్లందరికీ ఉద్యోగాలు ఎప్పుడో వచ్చేవి. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు కనుకనే కదా..ఇంత మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంది. కేసీఆర్ పాలనలో డిగ్రీలు, పీజీలు చదివిన నిరుద్యోగులు హమాలీ పని, పత్తి కూలీకి, ఆటో తోలుతూ పనులు చేసుకుంటున్నారు. 8 వేలకు ఆటో డ్రైవర్లుగా పోతున్నారు. ఇందుకేనా డిగ్రీలు, పీజీలు చదివింది..? కూలీ నాలీ చేసి వారిని కష్టపడి చదివించుకుంది ఇందుకేనా..? అప్పులు చేసి వారిని చదివించుకుంది హమాలీ పనికి పంపేందుకేనా..? మన పిల్లలు హమాలీ పనిచేయాలని మంత్రి కూడా అదే చెబుతున్నాడు. అంటే మన పిల్లలు హమాలీ పని చేసుకోవాలి. కేసీఆర్ పిల్లలు రాజ్యాలు ఏలాలని ఫైరయ్యారు.












Click it and Unblock the Notifications