ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!
ఇరాన్ వార్ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) సిలెండర్లకు భారీ కొరత ఏర్పడింది. యుద్దం నేపథ్యంలో ఎల్పీజీ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులు పెరిగి రేపు అస్సలు వంట చేసుకోవడానికి లేకుండా పోతాయన్న భయంతో ఎవరికి వారు సిలెండర్లు బ్లాక్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేంద్రం.. ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో రాష్ట్రాలకు కూడా ఎల్పీజీ కొరత తీర్చేలా పలు ఆదేశాలు ఇస్తోంది. ఇదే క్రమంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇవాళ 2026-27 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు లక్షా 3 వేల కోట్లతో ఆదాయ, వ్యయాలతో రూపొందించిన ఈ బడ్జెట్ లో పలు కీలక ప్రతిపాదనలు చేశారు. భారీ మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఇందులో ప్రాధాన్యత ఇచ్చారు. దేశ రాజధాని ఇప్పటివరకు చూసిన అతిపెద్ద బడ్జెట్లలో ఒకటి ఇది. అయితే ఇందులో సీఎం రేఖా గుప్తా గత ఆప్ ప్రభుత్వ 'ఉచితాల సంస్కృతి'ని తీవ్రంగా విమర్శించారు. అదే సమయంలో ఇంటింటికీ రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్ల (LPG cylinders) పథకం కోసం బడ్జెట్‌లో రూ.260 కోట్లు కేటాయించారు.

ఈ పథకం అమలులో భాగంగా హోలీ, దీపావళి రోజుల్లో ఈ రెండు సిలెండర్లు ప్రతీ ఇంటికీ ఉచితంగా ఇవ్వబోతున్నారు. ఇరాన్ వార్ నేపథ్యంలో దేశమంతా ఎల్పీజీ కొరత నెలకున్న తరుణంలో ప్రభుత్వం ఇలా రెండు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసిస్తున్నారు. ఢిల్లీ సర్కార్ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో సైతం ఎల్పీజీ సిలెండర్లు ఇలా ఉచితంగా ఇవ్వాలన్న డిమాండ్లు మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications