ఏపీ, తెలంగాణకు జీఎస్టీ బకాయిలు, వాటిపై పన్ను తగ్గింపు: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలివే
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 49వ జీఎస్టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వార్షికాదాయానికి సంబంధించి రిటర్నుల ఫైలింగ్ ఆలస్యంపై విధించే ఫీజును హేతుబద్ధీకరించారు. దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశం అనంతరం వివరాలను నిర్మలా సీతారామన్ వివరించారు.

ఏపీ, తెలంగాణకు జీఎస్టీ బకాయిలు ఎంతంటే.?
2022 జూన్ కు సంబంధించి రాష్ట్రాలకు చెల్లించాల్సిన రూ. 16,982 కోట్లను విడుదల చేస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ నిధులను కేంద్రం తన సొంత నిధుల నుంచి ఇస్తోందని, భవిష్యత్తులో సెస్సుల ద్వారా సమకూరే మొత్తం ద్వారా ఈ నిధులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. దీంతో 2017 జీఎస్టీ చట్టం ప్రకారం ఐదేళ్ల కాలానికి చెల్లించాల్సిన మొత్తం పరిహారాన్ని చెల్లించినట్లేనని స్పష్టం చేశారు. పరిహారం బకాయిల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 689 కోట్లు, తెలంగాణరాష్ట్రానికి రూ. 548 కోట్లు రానున్నాయి.

జీఎస్టీ ఆలస్య రుసుము హేతుబద్ధీకరణ ఇలా
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీఆర్-9 దాఖలు విషయంలో ఆలస్య రుసుమును హేతుబద్ధీకరించారు. రూ. 5 కోట్ల వరకు ఆలస్య రుసుము రోజుకు రూ. 50 గానూ, రూ. 50-20 కోట్ల టర్నోవర్ కలిగిన వారికి రోజుకు రూ. 100 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. కాగా, ప్రస్తుతం ఈ ఫీజు రూ. 200గా ఉంది. గుట్కా, పాన్ మసాలా పరిశ్రమలు పన్ను ఎగవేత, జీఎస్టీ అప్పీలేట్ ట్రైబ్యునల్స్ ఏర్పాటుకు సంబంధించిన రెండు వేర్వేరు మంత్రివర్గ ఉపసంఘాలు సమర్పించిన నివేదికలను స్వల్ప మార్పులతో ఈ సమావేశంలో ఆమోదించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. త్వరలో వీటిని సభ్యుల అభిప్రాయాల కోసం పంపనున్నామని, అనంతరం ఛైర్మన్ ఆమోదించనున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

పెన్సిల్, షార్ప్‌నర్లపై జీఎస్టీ తగ్గింపు
ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో లభించే ద్రవ బెల్లానికి ద్రవ బెల్లానికి సంబంధించి జీఎస్టీ రేటును 18 శాతం నుంచి సున్నాకు తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ బెల్లాన్ని ప్యాకింగ్ చేస్తే 5 శాతం పన్ను, విడిగా అమ్మితే ఎలాంటి పన్నూ లేదని చెప్పారు. పెన్సిల్, షార్ప్‌నర్‌లపై 18 శాతంగా ఉన్న పన్నును 12 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.












Click it and Unblock the Notifications