వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంటింట్లో మనకు తెలియకుండానే మనం చేసే 9 తప్పులు.. ఇవి చాలా ప్రమాదకరం అంటున్న నిపుణులు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చికెన్‌, ఆహారం

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 కోట్ల మంది కలుషిత ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాల బారిన పడుతున్నారు. వారిలో సుమారు 4,20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు కూడా.

ఈ రకమైన అనారోగ్యాలకు ప్రధాన కారణం బాక్టీరియా. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన ఆహారం లేదా ఎక్స్‌పైరీ డేట్ దాటినవి, సరిగ్గా భద్రపరచని ఆహారం తినడం ద్వారా ఈ బాక్టీరియా వ్యాపిస్తుంది.

ఇది జీర్ణవ్యవస్థకు, పేగులకు తీవ్ర హాని కలిగిస్తుంది. కొందరికి వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్ ఎక్కువై ఆస్పత్రిలో చేరే పరిస్థితి వస్తుంది.

ఈ అంశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పొందుపరిచే అంతర్జాతీయ స్థాయి గణాంకాలను చాలాకాలంగా ఆసక్తిగా పరిశీలిస్తున్నారు ప్రొఫెసర్ యులింటన్ పింటో. ఆయన యూనివర్సిటీ ఆఫ్ సావో పావులో ఫుడ్ రీసెర్చ్ సెంటర్‌లో మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నారు.

ఆ డేటాను అనుసరించి బ్రెజిల్‌లో కలుషిత ఆహారం వలన కలిగే అనారోగ్యాలపై పరీక్షలు ప్రారంభించారు. దీనికోసం ఒక బృందాన్ని తయారుచేశారు.

ఈ బృందం 2019లో తొలి సర్వే ప్రచురించింది. 2000, 2018 మధ్య ఆ దేశంలో కలుషిత ఆహారం వలన ఆనారోగ్యం పాలైనవారు 247,000 కాగా, 195 చనిపోయారని ఈ సర్వేలో తేలింది.

"చాలావరకు ఆహారం వంటింట్లోనే కలుషితం అవుతోందని మేం గమనించాం" అని పింటో చెప్పారు.

దీనికి కారణాలు కనుగొనేందుకు 2021లో పై పరిశోధకుల బృందం వంటింట్లో సాధారణ అలవాట్లను నిశితంగా పరిశోధించడం ప్రారంభించింది.

వారి పరిశోధన ఆధారంగా, వంటింట్లో సాధారణంగా చేసే తప్పులేంటి, అవి ఎంత ప్రమాదకరం, మన అలవాట్లను కొద్దిగా మార్చుకోవడం ద్వారా ఎంత లాభపడవచ్చు అనే విషయాలను పరిశీలిద్దాం.

ఆహారం

1. చికెన్‌ను సింకులో నీళ్లతో కడిగితే బాక్టీరియా పోతుందనుకోవడం

ఇది చాలా సాధారణంగా అందరూ చేసే తప్పు. పచ్చి మాంసాన్ని సింకులో కొళాయి కింద పెట్టి కడిగేస్తే అది శుభ్రం అయిపోయిందని మనం అనుకుంటాం.

కానీ, ఇది ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. కొళాయి నుంచి జోరుగా పడే నీళ్లు చికెన్‌పై పడి చుట్టుపక్కలంతా తుళ్లుతాయి.

సాధారణంగా సింకు పక్కనే తోమిన గిన్నెలు లేదా చేతులు తుడుచుకోవడానికి గుడ్డ లాంటివి ఉంటాయి. చికెన్ కడిగిన నీళ్లు తుళ్లి, వీటన్నిటి మీదా పడి బాక్టీరియాను వ్యాప్తి చేస్తాయి.

అంటే, శుభ్రంగా కడిగి బోర్లించిన చెంచా నోట్లో పెట్టుకున్నా సూక్ష్మజీవులు మన కడుపులోకి వెళ్లే అవకాశం ఉందన్నమాట. ఇది పేగులకు హాని కలిగించవచ్చు.

"చికెన్‌లో సహజంగా కొంత మొత్తంలో బాక్టీరియా ఉంటుంది. దాన్ని తొలగించడానికి ఉత్తమ మార్గం, దానిని వండడమే" అని పింటో వివరించారు.

అందుకని, చికెన్‌ను ఇల్లాంతా తుళ్లేలా నీళ్లతో కడగకుండా, మసాలాలతో మారినేట్ చేయడం మెరుగైన పద్ధతి. ఒకవేళ, కడగకపోతే మనసొప్పదు అనుకుంటే, జాగ్రత్తగా నీళ్లు తుళ్లకుండా కడగాలి.

చికెన్ లేదా గుడ్లను బాగా ఉడికించాలి. వాటిని వండుతున్నప్పుడు ఉష్ణోగ్రత కనీసం 70°Cకి చేరుకుంటే, వాటిలోని బాక్టీరియా అంతా తొలగిపోతుంది.

కూరగాయలు

2. పచ్చి కూరగాయలను నీటితో కడిగితే చాలనుకోవడం

పళ్లు, కూరగాయలను నీటితో కడిగి వండుకుంటాం లేదా పచ్చివి తింటాం. అయితే, ఇలా కడగడం వల్ల చాలావరకు మలినాలు తొలగిపోతాయిగానీ, బాక్టీరియా పూర్తిగా తొలగిపోదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

సూక్ష్మజీవులు పూర్తిగా తొలగిపోవాలంటే, ఒక గినెల్లో నీళ్లు తీసుకుని అందులో సోడియం హైపోక్లోరైట్ మిశ్రమం వేసి 15 నిముషాల పాటు కూరగాయలను అందులో నానబెట్టాలి.

ప్రత్యామ్నాయంగా నీళ్లల్లో ఉప్పు వేసి 15-20 నిమిషాల పాటు కూరగాయలను నానబెట్టాలి. తరువాత, వాటిని కొళాయి కింద నీళ్లతో కడగాలి. ఇలా చేస్తే బాక్టీరియా పూర్తిగా తొలగిపోతుంది. ఫ్రిడ్జిలో పెట్టుకోవాలంటే కూరగాయలను శుభ్రంగా తుడిచి ఫ్రిడ్జిలో పెట్టుకోవాలి.

"ఒక లీటరు నీళ్లకు ఒక చెంచా హైపోక్లోరైట్ ద్రావణం సరిపోతుంది" అని పింటో చెప్పారు.

ఇప్పుడు సూపర్‌మార్కెట్లలో ఈ ద్రావణం దొరుకుతుంది. లేదా మందుల షాపులో దొరుకుతుంది.

అయితే జాగ్రత్త వహించాలి. హైపోక్లోరైట్ కాకుండా ఇతర మిశ్రమాలున్న ద్రావణాలను వాడకూడదు. బ్లీచింగ్ కోసం క్లోరిన్ కలుపుతారు. క్లోరిన్ మన కడుపుకు అస్సలు మంచిది కాదు.

తొక్క తీసిన కూరగాయలు లేదా వండినవాటికి ఇంత శ్రమ పడక్కర్లేదు. ఉదాహరణకు, బంగాళ దుంపలు, ఆనపకాయ మొదలైనవాటిని ఉప్పు నీళ్లల్లో నానబెట్టి కడగక్కర్లేదు. వండుతున్నప్పుడు వాటిల్లో ఉన్న సూక్ష్మజీవులు తొలగిపోతాయి. బెండకాయలు, వంకాయలు మొదలైనవాటికి తొక్క తీయం కాబట్టి, వాటిని ఈ పద్ధతిలో కడగాలి.

3. తినే ముందు చేతులు కడుక్కోకపోవడం

కూరగాయలు శుభ్రంగా కడిగేసి వండుకున్నా, తినే ముందు చేతులు కడుక్కోకపోతే ఏమీ లాభం లేదు.

వేళ్లు, గోళ్లల్లో ఉండే వ్యాధికారక క్రిములు మనం తినే ఆహారంలోకి చేరుతాయి. దీనే నిపుణులు క్రాస్-కంటామినేషన్ అంటారు.

వంట చేసే ముందు, అన్నం తినే ముందు శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఒక ఆపిలో, బిస్కట్టో తినాలనుకున్నా, ముందు చేతులు కడుక్కోవడం ముఖ్యం.

నీళ్లు లేకపోతే శానిటైజర్‌తో చేతులు రుద్దుకోవచ్చు.

4. పచ్చివాటికి, వండేవాటికి ఒకే గిన్నెలు వాడడం

చాపింగ్ బోర్డు మీద మాంసం కట్ చేసి, అదే బోర్డు మీద అదే కత్తితో ఆపిల్ కట్ చేశారనుకోండి. ఏమవుతుంది? మాంసం పైన ఉండే సూక్ష్మజీవులు నేరుగా ఆపిల్‌లోకి వెళతాయి.

"పచ్చి మాంసం లేదా కూరగాయలు ముట్టుకున్నాక వెంటనే శుభ్రంగా చేతులు కడుక్కోవాలి" అని స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో మైక్రోబయాలజీ ప్రొఫెసర్ మారిజా లాండ్‌గ్రాఫ్ సూచించారు.

ఆహారం

5. వండిన పదార్థం పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జిలో పెట్టడం

ఒక్కో రకమైన సూక్ష్మజీవులకు ఒక్కో రకమైన ఉష్ణోగ్రతలు సౌకర్యంగా ఉంటాయి. ఆ ఉష్ణోగ్రతల వద్ద అవి తమ సంఖ్యను పెంచుకుంటాయి. కొన్ని రకాల బాక్టీరియా 25°C దగ్గర వేగంగా పెరుగుతాయి. మరి కొన్ని 30 లేదా 35°C వద్ద పెరుగుతాయి.

వండిన పదార్థాలు పూర్తిగా చాల్లారాక ఫ్రిడ్జిలో పెట్టడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు అర్థమైంది కదా.

మనం తిన్నాక మిగిలిపోయిన కూరలు ఫ్రిడ్జిలో పెడుతుంటాం. అప్పటికి అవి బాగా చల్లారిపోయి ఉంటాయి. వాటిల్లో బాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

అదే, వేడిగా ఉండగానే ఫ్రిడ్జిలో పెట్టేస్తే, ఆ చల్లని వాతావరణం బాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటుంది.

వండిన ఆహారం రూమ్ టెంపరేచర్‌కు వచ్చాక ఫ్రిడ్జిలో పెట్టడం అనేది పాత కాల నుంచి వచ్చిన అలవాటని లాండ్‌గ్రాఫ్ అంటారు. అప్పట్లో ఫ్రిడ్జిలు తక్కువ సామర్థ్యంతో పనిచేసేవి. వేడి పదార్థాలు పెడితే కరెంట్ ఎక్కువ అవుతుంది. అందుకే చాల్లారాక పెట్టేవారని ఆమె వివరించారు.

"ఇప్పుడు మంచి సామర్థ్యం గల ఫ్రిడ్జిలు వచ్చేశాయి. వేడివేడివి పెట్టినా ఏం ఫరవాలేదు" అని అన్నారు.

ఆహారం

6. ఫ్రిడ్జిలో ఎక్కడ ఏ పదార్థాలు పెట్టాలో తెలియకపోవడం

ఫ్రిడ్జిలో వివిధ అరల్లో వివిధ ఉష్ణోగ్రతలు ఉంటాయి. అందువల్ల మనం ఏ అరలో ఏది పెడతామనేది చాలా ముఖ్యం.

తాజాకూరలు, వండిన పదార్థాలకు ఎక్కువ చల్లదనం కావాలి. డ్రింకులు, మసాలాలకు అంత తక్కువ టెంపరేచర్ అవసరం ఉండదు.

కాబట్టి, ఫ్రిడ్జిలో ఎక్కడ ఏ పదార్థాలు పెట్టాలో తెలుసుకుందాం.

  • పైన ఉన్న ట్రేలో గుడ్లు, పాలు, పాల పదార్థాలు
  • రెండో ట్రేలో తినగా మిగిలిన పదార్థాలు
  • మూడో అరలో అంతగా చల్లదనం అవసరం లేని పదార్థాలు
  • కింద డ్రాయర్‌లో కూరగాయలు, పళ్లు
  • పక్క డోరులో పానీయాలు, మసాలాలు, జ్యూస్, నీళ్లు

ఇదే కాకుండా, ఏ పదార్థాన్ని ఎన్నాళ్లు ఫ్రిడ్జిలో ఉంచవచ్చు అన్నది తెలుసుకోవడం కూడా ముఖ్యం

  • చేపలు, మాంసం: 3 రోజులు
  • సాసులు: 20-30 రోజులు
  • తిన్నాక మిగిలినవి: 1-2 రోజులు
  • పళ్లు, కాయగూరలు: 3-7 రోజులు
  • పాలు: 2-5 రోజులు
  • బేకరీ, కేకులు, పేస్ట్రీలు: 5 రోజులు
  • గుడ్లు: 7 రోజులు

7. పచ్చిమాంసంపై మూత పెట్టకపోవడం

ఒకటి కచ్చితంగా చెప్పాలి. ఫ్రిడ్జిలో పెట్టేస్తే అసలు బాక్టీరియా అభివృద్ధి చెందదు అనుకోకూడదు.

అవి సహజంగా ఆహారంలో ఉంటాయి. ఎప్పటికీ ఉంటాయి. అయితే, ఫ్రిడ్జిలో అవి పెరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.

షాపు నుంచి మాంసం కొనుక్కొచ్చి నేరుగా ఫ్రిడ్జిలో పెట్టకూడదు. మాంసంకొట్టులో లేదా సూపర్‌మార్కెట్లో కొన్న మాంసాన్ని పాలిథీన్ కవర్‌లోనో లేదా బాక్సులోనో పెట్టి ఇస్తారు. మాంసం పెట్టిన కవర్లో కొంచం రక్తం లేదా ఇతర ద్రవాలు ఉండిపోవచ్చు. వాటిల్లో బాక్టీరియా నిక్షిప్తమై ఉంటుంది.

ప్యాకెట్టుకు కన్నాలున్నా, లేదా లీక్ అవుతున్నా బాక్టీరియా ఇతర పదార్థాలకు వ్యాపిస్తుంది.

కాబట్టి కొనుక్కొచ్చిన మాంసాన్ని అలా ఫ్రిడ్జిలో పెట్టకుండా, కవరు తీసి వేరే గిన్నెలోకి మార్చి లోపల పెట్టాలి. మూత పెట్టడం మరచిపోకూడదు.

1-2 రోజుల్లో వండుకోవాలనుకుంటే ఫ్రిడ్జిలోనే ఉంచవచ్చు. అంతకన్నా ఎక్కువ రోజులైతే ఫ్రీజర్‌లో ఉంచడం మంచిది.

ఆహారం

8. ఫ్రీజర్‌లో పెట్టిన వాటిని కరిగించడం

ఫ్రీజర్‌లో ఐస్‌క్రీములు, పచ్చిమాంసం లాంటివి పెడుతుంటాం. ఫ్రీజర్‌లో ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉంటాయి. అక్కడ సూక్ష్మజీవుల మనుగడ దాదాపు అసాధ్యం.

అయితే, వీటిని బయటకు తీసి కరిగించడంలోనే ఉంది అసలు చిక్కు.

త్వరగా కరగడానికి నీళ్లల్లో కూడా పెడుతుంటాం. బయట ఉంచినా, నీళ్లల్లో ఉంచినా ఆహారం కలుషితం కావడానికి అవకాశాలు ఎక్కువ. కరుగుతుంటే నీరు కారుతుంటుంది. అది చాలు బాక్టీరియా విజృంభించడానికి.

"ఫ్రిడ్జిలోనే ఉంచి డీఫ్రోజ్‌ చేయడం మేలు. అలా చేస్తే ఆహార పదార్థాల రూపం కూడా మారదు" అని లాండ్‌గ్రాఫ్ వివరించారు.

ఒకవేళ మనం తొందర్లో ఉంటే, మైక్రోవేవ్‌లో పెట్టి కరిగించడం మేలు. మైక్రోవేవ్‌లో డీఫ్రో‌‌జ్‌కి ఒక ఫంక్షన్ ఉంటుంది. అది వాడి కరిగించవచ్చు.

9. తరచూ ఫ్రిడ్జి శుభ్రం చేయకపోవడం

తరచూ ఫ్రిడ్జిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. మరకలు, బయటకు చిందిన పదార్థాలు శుభ్రం చేయాలి. వీటన్నిట్లోనూ సూక్ష్మజీవులు వృద్ధి చెందే అవకాశం ఉంది.

ముందు ఫ్రిడ్జి ప్లగ్ తీసేయాలి. కరంట్ ఆపేయాలి. లోపలున్న పదార్థాలన్నీ బయటకు తీయాలి. పాతవి ఏమైనా ఉంటే ఎక్స్‌పైరీ డేటు చూసి పారేసేందుకు ఇదే మంచి సమయం.

అరలు, డ్రాయర్లు వంటివి బయటకు తీసి శుభ్రంగా నీటితో కడగాలి. అవి పొడిగా ఆరేవరకు లోపల పెట్టకూడదు.

స్పాంజి లేదా తడిగుడ్డతో ఫ్రిడ్జి అంతా తుడవాలి. తరువాత పొడిగుడ్డతో తుడవాలి.

చివరిగా, మళ్లీ అన్నీ లోపల పెట్టి, సర్దుకున్నాక ప్లగ్ ఆన్ చేయాలి.

కనీసం నెలకి ఒకసారైనా ఫ్రిడ్జిని శుభ్రం చేసుకోవాలని పింటో పరిశోధకుల బృందం సూచించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
9 common mistakes made in kitchen,experts say very dangerous
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X