అజిత్ దోవల్ ఇంట్లో జొరపడటానికి ఆగంతకుడి యత్నం: శరీరంలో చిప్?: కలకలం
న్యూఢిల్లీ: జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ నివాసం వద్ద కలకలం చెలరేగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంట్లోకి జొరపడటానికి విఫల ప్రయత్నం చేశాడు. అతని ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు. అతని శరీరంలో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చినట్లు తొలుత వార్తలొచ్చాయి. ఈ చిప్ ద్వారా అతణ్ని తమ ఆధీనంలోకి తీసుకుని, తాము చెప్పినట్టు చేసేలా కంట్రోల్ చేశారనే ప్రచారం సాగింది. పోలీసులు ఈ వార్తలను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.
అజిత్ దోవల్.. 5, జన్‌పథ్‌లో నివాసం ఉంటోన్నారు. భద్రత కారణాల వల్ల ఆయన నివాసం వద్ద ఎలాంటి నేమ్ ప్లేట్ కూడా అమర్చలేదు పోలీసులు. అయినప్పటికీ- ఆయన నివాసాన్ని గుర్తు పెట్టాడో ఆగంతకుడు. ఈ ఉదయం 7:30-8 గంటల మధ్య అతను అజిత్ దోవల్ ఇంట్లోకి చొరపడటానికి తీవ్రంగా ప్రయత్నించాడు. తొలుత జన్‌పథ్‌లో ప్రవేశించాడు. అక్కడి నుంచి నేరుగా అజిత్ దోవల్ నివాసానికి వెళ్లాడు. ఇంట్లోకి చొరపడే ప్రయత్నం చేశాడు.

అతణ్ని గుర్తించిన సెక్యూరిటీ అధికారులు అప్రమత్తం అయ్యారు. అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. గట్టిగా కేకలు వేశాడు. తనను వదిలేయాలని, అజిత్ దోవల్‌తో పని ఉందంటూ మొండికేశాడు. పిచ్చి పట్టినట్లు వ్యవహరించాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ ఆగంతకుడి పూర్వాపరాలను ఆరా తీశారు. ప్రాథమిక దర్యాప్తు సందర్భంగా అతను ఓ అద్దెకారు డ్రైవర్ అని పోలీసులు నిర్ధారించారు.
కాగా- ఆ గుర్తు తెలియని వ్యక్తి శరీరంలో చిప్‌ను అమర్చినట్లు వార్తలొచ్చాయి. ఆ చిప్ ద్వారా అతని శరీరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, నియంత్రించే ప్రయత్నాలు సాగారనే ప్రచారం సాగింది. దీన్ని పోలీసులు తోసిపుచ్చారు. అతనికి ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించామని, శరీరంలో ఎక్కడా, ఎలాంటి చిప్ అమర్చినట్లు నిరూపితం కాలేదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఆ వ్యక్తి స్వస్థలం బెంగళూరు అని విచారణ సందర్భంగా తేలినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications