అసభ్యత: యువకుడి చెంప చెళ్లుమనిపించిన నగ్మా
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి నగ్మాకు తిప్పలు తప్పడం లేదు. రెండు రోజుల క్రితం ఓ శాసనసభ్యుడు ఆమెను బహిరంగంగా ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేయగా, శుక్రవారంనాడు ఓ యువకుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన వైపు దూసుకొస్తున్న యువకుడిని గమనించి నగ్మా అతని చెంప చెళ్లుమనిపించింది.
తన అందం, ఇమేజ్ నగ్మాకు ప్రచారం కత్తి మీద సాముగా మారుస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నియోజకవర్గంలోని జల్లికోట్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సభకు పెద్ద యెత్తున ప్రజలు వచ్చారు. కొంత మంది యువకులు ఆమెతో కరచాలనం చేయడానికి పోటీ పడ్డారు.

నగ్మాతో కరచాలనానికి పోటీ పడిన యువకులకు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుపడ్డారు. దీంతో యువకులకు, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య తోపులాట చోటు చేసుకుంది. దాంతో నగ్మా అక్కడి నుంచి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. నగ్మా దృష్టిలో పడాలని యువకులు తీవ్రంగా ప్రయత్నించారు.
నగ్మా యువకుడిపై చేయి చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అక్కడి నుంచి వెళ్లిపోయే ముందు వారిని చల్లబరచడానికి నగ్మా ప్రయత్నించారు. అయితే, ఆ ప్రయత్నం పెద్దగా ఫలితం ఇవ్వలేదు. నగ్మాకు భద్రత కల్పించే విషయంలో పాలనా యంత్రాంగం శ్రద్ధ పెట్టలేదని జిల్లా కాంగ్రెసు కమిటీ యాక్టింగ్ ప్రెసిడెంట్ మనోజ్ త్యాగి విమర్శించారు.












Click it and Unblock the Notifications