అన్నాడీఎంకే మిత్రపక్ష ఎమ్మెల్యేలు: ఎవరికి మద్దతు, రహస్య చర్చలు, పళని? శశికళ ?
అన్నాడీఎంకేలో అధికారంలో ఉన్న ఎడప్పాడి పళనిసామికి మద్దతు ఇవ్వాలా ? చిన్నమ్మ శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ కు మద్దతు ఇవ్వాలా ?
చెన్నై: అన్నాడీఎంకేలో అధికారంలో ఉన్న ఎడప్పాడి పళనిసామికి మద్దతు ఇవ్వాలా ? చిన్నమ్మ శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ కు మద్దతు ఇవ్వాలా ? అనే విషయంలో ఆ పార్టీ మిత్రపక్ష శాసన సభ్యులు అయిన ముగ్గురు ఇప్పుడు అయోమయంలో పడిపోయారు.
వారం రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న అన్నాడీఎంకే మిత్రపక్ష ఎమ్మెల్యేలు కరుణాస్, తనియరసు, తమీమ్ అన్సారి మంగళవారం చెన్నైలో ప్రత్యక్షం అయ్యారు. చెన్నైలోని ఎమ్మెల్యే క్వాటర్స్ లో కరుణాస్ తమీమ్ అన్సారీ, తనియరసు చర్చలు జరుపుతున్నారు.

మొదటి నుంచి శశికళ వర్గీయుడు అని గుర్తింపు తెచ్చుకున్న నటుడు, ఎమ్మెల్యే కరుణాస్ రెండు మూడు సార్లు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చేరుకుని ములాఖత్ లో చిన్నమ్మతో భేటీ అయ్యారు. చెన్నైలోని టీటీవీ దినకరన్ ఇంటికి అనేక సార్లు వెళ్లి వచ్చారు.
శశికళకు మద్దతు ఇస్తే నియోజక వర్గంలో తిరగలేవు అంటూ సొంత నియోజక వర్గంలోని ప్రజలు హెచ్చరించడంతో కరుణాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు వ్యతిరేకంగా ఓటు వేసిన తమీమ్ అన్సారీ, మరో ఎమ్మెల్యే తనియరసు ఇప్పుడు చర్చలు జరిపి ఎవరికి మద్దతు ఇస్తారో వేచి చూడాలి. మొత్తం మీద వారం తరువాత ప్రత్యక్షం అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు చెన్నైలో రహస్యంగా చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications