నా పేరును ‘RV155677820’గా మార్చండి.. హైకోర్టులో ఓ ఆటో డ్రైవర్ పిటిషన్!
గుజరాత్: ఓ ఆటో డ్రైవర్ తన పేరు మార్చాలంటూ ఏకంగా హైకోర్టు తలుపు తట్టాడు. 'నాకు పేరు లేదు. మతం లేదు. నేనో నాస్తికుడిని. దయచేసి నా పేరు మార్చండి..' అంటూ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రాజ్‌వీర్ ఉపాధ్యాయ్ అనే ఆటో డ్రైవర్ హైకోర్టులో పిటిషన్ వేశాడు.
తనకు సంబంధించిన అన్ని పత్రాల్లో పేరు, మతం మార్చాలని 2015 నుంచి రాజ్‌వీర్ ఉపాధ్యాయ్ ప్రయత్నిస్తున్నాడు. దీనికోసం రాజ్‌కోట్‌లోని గెజిట్ కార్యాలయానికి కూడా వెళ్లాడు. తనకు సంబంధించిన అన్ని పత్రాల్లో తన పేరు, మతం తొలగించి దాని స్థానంలో 'RV155677820' పెట్టాలని కోరాడు.

అయితే ఆటోడ్రైవర్ రాజ్‌వీర్ ఉపాధ్యాయ్ అభ్యర్థనను అధికారులు అంగీకరించలేదు. ఎప్పుడంటే అప్పుడు మనకు నచ్చినట్టు పేరు మార్చుకునే హక్కు ఉండదని వారు అతడికి చెప్పారు. అయినా రాజ్‌వీర్ తన పట్టు వీడలేదు.
చివరికి ఓ న్యాయవాది ద్వారా గుజరాత్ హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు. 'నేను హేతువాదిని. మనది మత రహిత దేశం. అందుకే నా పేరు, మతం ఎవ్వరికీ తెలీనివ్వకూడదని అనుకుంటున్నాను. నా పేరులోని 'rv' అక్షరాలతో పాటు నా పదో తరగతి సర్టిఫికెట్‌లో ఉన్న నెంబరును జత చేసి పేరు మార్చండి..' అంటూ తన పిటిషన్‌లో అతడు అభ్యర్థించాడు.
పేరు మార్పు కోసం గతంలోనే రాజ్‌కోట్‌లోని గెజిట్ కార్యాలయానికి వెళ్లి ఆటోడ్రైవర్ రాజ్‌వీర్ ఉపాధ్యాయ్ అభ్యర్థించాడు. తీరా అతడు హైకోర్టు తలుపు తట్టాక రాజ్‌కోట్ గెజిట్ కార్యాలయం మేనేజర్ పి.జి షా స్పందించారు. అయితే ఈ విషయం గురించి తనకు ఎలాంటి సమాచారం అందలేదని ఆయన పేర్కొనడం గమనార్హం.












Click it and Unblock the Notifications