బెంగళూరు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఆల్మోస్ట్ రెడీ..!!
బెంగళూరు సిటీ వాహనదారులకు శుభవార్త. మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ దాదాపుగా పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ ఈ నెల చివరి నాటికి లేదా వచ్చే సంక్రాంతికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అత్యంత రద్దీ రహదారుల్లో ఒకటైన సిల్క్ బోర్డు జంక్షన్ మీదుగా హెచ్ఎస్ఆర్ లేఅవుట్, బీటీఎం లేఅవుట్‌ను కలుపుతూ స్టీల్ గర్డర్ల ఏర్పాటు పూర్తి కావొస్తోంది. ఈ పనులను చకచకా పూర్తి చేస్తోంది బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్.
ఈ ఎలివేటెడ్ రూట్ నిర్మాణం పూర్తయితే హెచ్ఎస్ఆర్ లేఅవుట్, బీటీఎం లేఅవుట్, రాగిగుడ్డ ప్రాంతాల మధ్య నిరంతరాయంగా రాకపోకలు సాగించవచ్చు. ఈ మూడు ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు కొత్త డౌన్ ర్యాంప్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇది ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. రద్దీగా ఉండే గ్రౌండ్ లెవెల్ జంక్షన్ నుండి ట్రాఫిక్‌ను మళ్లించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్‌పై వాహనాల రాకపోకలను మరింత మెరుగుపరుస్తుంది.

గతంలో రాగిగుడ్డ-సిల్క్ బోర్డు మార్గంలో ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ను పాక్షికంగా ప్రారంభించారు. అది వన్ వే. ఫలితంగా ట్రాఫిక్ కొంతవరకు తగ్గింది. డబుల్ వే ఉన్న భాగం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇప్పుడు 5.5 కిలోమీటర్ల పూర్తి మార్గం పూర్తయింది. వాహనదారుల కోసం దీన్ని తెరవడం వల్ల బీటీఎం లేఅవుట్, రాగిగుడ్డ, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, ఎలక్ట్రానిక్స్ సిటీ, మడివాళ మధ్య ప్రయాణించే వారికి భారీ ప్రయోజనం చేకూరుతుంది.
వాస్తవానికి- హెచ్ఎస్ఆర్ నుండి బీటీఎం ర్యాంప్‌ను సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకుని రావాలని బీఎంఆర్సీఎల్ ప్రణాళిక వేసింది. అధిక ట్రాఫిక్, పరిమిత నిర్మాణ సమయాలు, రీడిజైనింగ్, సాంకేతిక సవాళ్ల కారణంగా పనులు నెమ్మదించాయి. ఈ సమస్యలు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ టైమ్ లైన్ ను ఆలస్యం చేశాయి. ఎలక్ట్రానిక్స్ సిటీ వైపు మలుపు తిరిగే రేడియస్‌కు సంబంధించిన సాంకేతిక సమస్య కారణంగా డిజైన్‌లో మార్పు అవసరమైంది.
ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్ గర్డర్లకు బదులుగా 42 మీటర్ల స్టీల్ గర్డర్‌ను ఉపయోగించాలని నిర్ణయించారు. దీంతో కొంత జాప్యం ఏర్పడింది. ఫ్లైఓవర్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా సిల్క్ బోర్డు జంక్షన్ కింద ట్రాఫిక్ సిగ్నల్స్ తొలగించే అవకాశం లేదు. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చాక బొమ్మనహళ్లి, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, మాడివాళ నుండి వచ్చే వాహనాలు గ్రౌండ్ లెవెల్ జంక్షన్‌ను ఉపయోగించవచ్చు.












Click it and Unblock the Notifications