గంగా నదిలో పడవ బోల్తా.. 11 మంది మృతి.. 9 మంది గల్లంతు..
బిహార్లోని వైషాలి జిల్లాలోని రాఘోపూర్ వద్ద ఉన్న గంగా నదిలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడి 11 మంది మృతి చెందారు. మృతుల్లో చాలామంది చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో 15 నుంచి 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరంతా ఓ విందుకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమలంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టం అవుతోంది.
ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. అలాగే స్థానికులు కూడా ఈ బృందాలకు సహాయం చేస్తున్నారు. గల్లంతైన వారికోసం తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మొత్తం ఘటనను జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఇక ఈ ఘటనపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేశారు. రాఘోపూర్ లో పడవ ప్రమాదం జరిగిన విషయం తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. మృతుల్లో చాలా మంది చిన్నారులే ఉండటం తనను కలచివేసిందని తెలిపారు.
ఈ ఘటనపై తాను స్థానిక అధికారులు, ప్రజలతో మాట్లాడానని ఈ మేరకు గాలింపు చర్యలను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అని గల్లంతైన వారంతా ప్రాణాలతో ఉండాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వివరించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని కోరినట్లు పేర్కొన్నారు.

ఇక సెప్టెంబర్ 8 న కూడా బిహార్ లోని వైషాలి జిల్లాలో పడవ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గంగానదిలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ప్రమాదంలో 9 మందిని సురక్షితంగా కాపాడారు. మిగిలిన వారు ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. అయితే తాజాగా నెల రోజుల వ్యవధిలో మరో పడవ ప్రమాదం జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
