ఐటీ ఉద్యోగులకు తీపి కబురు: ఎల్1బీ వీసాల జారీని సరళతరం చేసిన ఒబామా
వాషింగ్టన్: ఎల్1బీ వర్క్ వీసాల జారీ ప్రక్రియను సరళతరం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా ప్రకటించారు. దీంతో భారతీయ వృత్తి నిపుణులు వీసా కేంద్రాల వద్ద ఎదుర్కొంటున్న ఇక్కట్లకు తెరపడడంతో పాటు భారత కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులను తేలిగ్గా అమెరికాకు పంపగులుగుతాయి.
విదేశీ పెట్టుబడులను, ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఉద్యోగులన అమెరికా దిశగా ఆకర్షించడం కోసమే ఈ మార్పులు తీసుకురానున్నట్లు అధ్యక్షడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అంతే కాకుండా, అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ కంపెనీలు తమ యూనిట్లు నెలకొల్పడానికి, పెట్టుబడులు పెట్టడానికి తన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదని చెప్పారు.

మంగళవారం జరిగిన 'సెలక్ట్ యూఎస్ ఏ సమ్మిట్'లో ఒబామా మాట్లాడారు. ఎల్1బీ వర్క్ వీసా ప్రక్రియను సరళీకరించడం వల్ల కార్పోరేట్ కంపెనీలు తమ ఉద్యోగులను ఏదైనా విదేశం నుంచి అమెరికాకు తరలించడం సులువుతుందని ఒబామా చెప్పారు. ఇది వేలాది మంది వలస కార్మికులు, ఉద్యోగులకు, వారి యాజమాన్యాలకు ఉపయోగకరంగా ఉండడంతో పాటు అమెరికన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని అన్నారు.
పలు భారత కంపెనీలు కూడా ఈ సెలక్ట్ యుఎస్‌ఏ సదస్సులో పాల్గొన్నాయి. ఎల్ 1బీ వీసాలు భారీ స్థాయిలో తిరస్కరణకు గురి కావడం భారతీయ కంపెనీలకు ప్రధాన అవరోధంగా ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్ఠంగా నిలపడంలో దోహదపడే ఈ చర్యలకు సహకారం అందించాలని ఆయన రిపబ్లికన్లకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications