నిర్మల సీతారామన్ చీరెపై పెద్ద కథే ఉంది..
Nirmala Sitharaman Saree: ఇంకొద్ది సేపట్లో.. వార్షిక బడ్జెట్ పార్లమెంట్ ఉభయ సభల ముందుకు రాబోతోంది. 2025- 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు ఇవి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. సరిగ్గా ఈ ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ఆరంభించనున్నారు. సుమారు రెండుగంటల పాటు ఈ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది.
ఈ ఉదయం 8:30 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరిన నిర్మల సీతారామన్.. నేరుగా తన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సహాయ మంత్రి పంకజ్ చౌదరి, సలహాదారు అనంత నాగేశ్వరన్, ఇతర అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. మర్యాదపూరకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్‌కు బయలుదేరారు.

రక్షణ మంత్రిత్వ శాఖతో పాటు, వ్యవసాయం, రైల్వేలు, జాతీయ రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పన రంగాలకు భారీ మొత్తంలో బడ్జెట్‌ను కేటాయించవచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. విద్య, వైద్యం, డిజిటల్ ఇండియా, పీఎంఏవై, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వాటికి కల్పించాల్సిన సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.
ప్రధానంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి చెందిన పరిశ్రమలకు రాయితీలను ఇచ్చే అవకాశాలు లేకపోలేదీసారి బడ్జెట్‌లో. జీఎస్టీ శ్లాబుల విధానం, పన్నులు, వేతన జీవులకు ఊరట కల్పించడం వంటి తాయిలాలు లేకపోలేదు. అదే సమయంలో- గత ఏడాది తరహాలోనే ఇప్పుడు కూడా ఏపీ బిహార్‌లకూ వరాలు ప్రకటిస్తారని అంటున్నారు.
ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (యునైటెడ్) అధికారంలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఈ మేరకు ఈ రెండు రాష్ట్రాలు ఇదివరకే తమ ప్రతిపాదనలను కేంద్రానికి అందజేశాయి. వాటిపై మూడు రోజుల కిందట జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలోనూ చర్చకు వచ్చినట్లు సమాచారం.
బడ్జెట్ రోజున నిర్మల సీతారామన్ ధరించిన చీరె అందరి దృష్టినీ ఆకర్షించింది. బాదం రంగు నేత చీరె, దానిపై హస్త కళాకారులు చిత్రీకరించిన బొమ్మలను ముద్రించారు. ఇది- ప్రఖ్యాతి చెందిన మధుబని ఆర్ట్ కళంకారీ చీరె. బిహార్‌లోని మధుబని జిల్లా ఈ కళంకారీకి పెట్టింది పేరు. పుట్టిందీ అక్కడే.
పద్మ అవార్డు గ్రహీత దులారీ దేవి ఈ చీరెను డిజైన్ చేశారు. ఆమె రూపొందించిన మధుబని బొమ్మలను దీనిపై ముద్రించారు. మిథిల ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన సందర్భంగా దులారీ దేవిని కలిశారు నిర్మల సీతారామన్. అప్పుడే ఆమె ఈ చీరెను నిర్మల సీతారామన్‌కు బహూకరించారు. బడ్జెట్ రోజున ధరించాలని కోరారు.












Click it and Unblock the Notifications