ప్రధాని మోదీ ఆదేశాల మేరకు..!!
India Pakistan War: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారానికి దిగింది భారత్. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను పెంచిపోషిస్తోన్న పాకిస్తాన్‌పై మిస్సైళ్లతో దాడి చేసింది.
తెల్లవారు జామున 2 గంటల సమయంలో తొలి మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ దాడుల్లో జైషె మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాద క్యాంపులు ధ్వంసం అయ్యాయి. పలువురు ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వస్తోన్నాయి.

అదే సమయంలో అటు దేశ రాజధానిలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్ దీనికి కేంద్ర బిందువు అయింది. మోదీ అత్యున్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. రక్షణ, విదేశాంగ, జాతీయ భద్రత సలహా మండలి.. వంటి శాఖలు, విభాగాలకు చెందిన అధికారులు దీనికి హాజరయ్యారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రత సలహాదారు అజితో దోవల్ ఈ భేటీకి హాజరయ్యారు. పాకిస్తాన్ భూభాగంపై ఇఫ్పటివరకు జరిగిన వైమానిక దాడులను ఈ సందర్భంగా ప్రధాని మోదీ సమీక్షించారు.
తాజాగా అఖిల పక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. గురువారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ఏర్పాటైంది. అన్ని పార్టీల ప్రతినిధులను ఆహ్వానించనుంది. కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయాన్ని వెల్లడించారు. తన అధికారిక ఎక్స్‌పై ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు.
కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్.. ఈ అఖిల పక్ష సమావేశాన్ని ఉద్దేశించి మాట్లడతారు. పాకిస్తాన్‌పై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనే విషయాన్ని వివరిస్తారు. పమల్గామ్ ఉగ్రదాడి తరువాత దేశంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు, ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి తెలియజేస్తారు.
కాంగ్రెస్, మజ్లిస్ సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ మిస్సైళ్ల దాడిని సమర్థించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు, వాటికి మద్దతు ఇచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదంటూ ఇప్పటికే బీజేపీయేతర పార్టీలన్నీ కూడా ముక్తకంఠంతో తమ అభిప్రాయాలను తెలియజేశాయి.












Click it and Unblock the Notifications