వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రధాని ప్రకటన-పార్లమెంటులో ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసా ?
కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ఇవాళ ప్రకటించారు. ప్రధాని ప్రకటన నేపథ్యంలో చట్టాల రద్దు కోసం కేంద్రం చర్యలు తీసుకుంటోంది పార్లమెంటు శీతాకాలసమావేశాల్లోనే చట్టాల రద్దు ఉంటుందని ప్రధాని ప్రకటించారు. దీంతో పార్లమెంటులో అసలు చట్టాల రద్దు ప్రక్రియ ఎలా జరుగుతుందన్న దానిపై మరోసారి చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చట్టాల రద్దు ప్రక్రియ గురించి ఓసారి తెలుసుకుందాం....
Recommended Video

వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్రం చర్యలు
రైతుల ఆందోళనల నేపథ్యంలో గతంలో తాము తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ఇవాళ ప్రకటన చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ ప్రక్రియ చేపట్టేందుకు చర్యలు ప్రారంభిస్తోంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే సమావేశాల అజెండాలోనే చట్టాల రద్దు ప్రక్రియను ప్రకటించబోతోంది. పార్లమెంటు సమావేశాల అజెండాలో ఉన్న చట్టాల రద్దుపై సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి బిల్లుల ఉపసంహరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంటులో చట్టాల రద్దు
గతంలో పార్లమెంటు చేసిన అనేక చట్టాల్ని కేంద్ర ప్రభుత్వాలు రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు కేవలం ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వాలు చేసిన దాదాపు 1500 చట్టాల్ని రద్దు చేశారు. ఇందులో చాలా మటుకు ప్రస్తుత అవసరాలకు తగినట్లు లేవని భావిస్తూ రద్దు చేసినవే ఉన్నాయి. వీటి రద్దుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చర్చించి రద్దు చేసిన సందర్భాలున్నాయి. కొన్ని చట్టాలు ఎలాంటి చర్చ లేకుండా నేరుగా రద్దయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పడు వ్యవసాయ చట్టాలపై కేంద్రం ఎలాంటి వైఖరి అనుసరించబోతోందన్న దానిపై చర్చ జరుగుతోంది.

పార్లమెంటులో చట్లాల రద్దు ప్రక్రియ
పార్లమెంటులో చట్టాల రద్దు కోసం అనుసరించే ప్రక్రియను ఓసారి తెలుసుకుందాం. పార్లమెంటులో ఓ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఎలాంటి ప్రక్రియ ఉంటుందో దాన్ని రద్దు చేసేటప్పుడు కూడా అలాంటి ప్రక్రియనే అనుసరించాల్సి ఉంటుంది. రద్దు చేయాలనుకున్న బిల్లుల్ని సైతం రద్దుకు ప్రతిపాదిస్తూ పార్లమెంటులోని ఇరుసభల్లోనూ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని న్యాయశాఖ పరిశీలనకు పంపుతుంది. అక్కడ ఆమోదం లభిస్తే ఆ తర్వాత దానిపై సభ్యులు ఎందుకు రద్దు చేయాల్సి వస్తోందో, దానికి దారి తీసిన పరిస్ధితులు ఏంటో పార్లమెంటులో చర్చిస్తారు. ఆ తర్వాత ఓటింగ్ ఉంటుంది. ఆ తర్వాత వాటి రద్దును ఆమోదిస్తూ ఓటింగ్ కూడా నిర్వహిస్తారు. బిల్లు పాస్ కావడానికి ఎలా అయితే మెజారిటీ ఓట్లు కావాల్సి ఉంటుందో అలాగే రద్దు కోసం కూడా అలాగే మెజారిటీ ఓట్లు లభిస్తేనే బిల్లు రద్దు అవుతుంది.

మెజారిటీ ప్రకారమే నిర్ణయం
బిల్లు ఆమోదం తరహాలోనే బిల్లుల రద్దు కోసం కూడా ఓటింగ్ నిర్వహింస్తారు. ఇందులో ప్రభుత్వం తగినంత మెజారిటీతో దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అలా కాకుండా మెజారిటీ లభించకపోతే మాత్రం బిల్లులు రద్దు కావు. ఓసారి బిల్లు రద్దు ఆమోదం కాకపోతే మాత్రం ఈ ప్రక్రియ వాయిదా పడుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం మరోసారి బిల్లుల్ని ఉపసంహరిస్తూ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. కుదరకపోతే మాత్రం బిల్లుల రద్దును ఉపసంహరించుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించే అవకాశాలు కూడా ఉంటాయి.












Click it and Unblock the Notifications