మహిళలకు రూ. 12వేలు, రూ. 500కే సిలిండర్: ఛత్తీస్‌గఢ్ బీజేపీ మేనిఫెస్టోలో కీలక అంశాలు
రాయ్‌పూర్: మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండటంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కీలక హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీతో హోరాహోరీగా బీజేపీ కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రెండు పార్టీలు ఒకరికి మించి ఒకరు హామీలను ఇస్తున్నారు. తాజాగా, బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) విడుదల చేశారు.
పెళ్లయిన మహిళలకు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సహాయం సహా మొత్తం 20 హామీలను ఇందులో ప్రకటించారు. తమను గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో ఛత్తీస్‌గఢ్ ను పూర్తిగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుదతామని అమిత్ షా ఈ సందర్భంగా ఓటర్లకు హమీ ఇచ్చారు. పండరియాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్‌పై విమర్శలు గుప్పించారు అమిత్ షా. రాష్ట్ర ఖజానాను ఏటీఎంగా మార్చేసి.. ఢిల్లీకి తరలిస్తున్నారని ఆరోపించారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన 'ప్రీపెయిడ్ సీఎం'గా అభివర్ణించారు అమిత్ షా. బఘెల్ మరోసారి అధికారంలోకి వస్తే.. రాష్ట్రం నుంచి రూ. వేల కోట్లను కాంగ్రెస్ పార్టీ స్వాహా చేస్తుందని ఆరోపించారు.
కాగా, అమిత్ షా విడుదల చేసిన మేనిఫెస్టోలోని కీలక హామీలను గమనించినట్లయితే.. రెండేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పేద కుటుంబాలకు రూ. 500కే గ్యాస్ సిలిండర్, క్వింటాలుకు రూ. 3100 చొప్పున ధాన్యానికి మద్దతు ధర, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం, మహిళలకు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సాయం, రాయ్‌పూర్, నయా రాయ్‌పూర్, దుర్గ్, బిలాయ్ ప్రాంతాల అభివృద్ధి కోసం ఢిల్లీ ఎన్సీఆర్ మాదిరి రాష్ట్ర రాజధాని ప్రాంతం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మేనిఫెస్టోకు మోడీకి గ్యారంటీ అని పేరు పెట్టారు.
#WATCH | Raipur | Union Home Minister Amit Shah releases BJP's manifesto for Chhattisgarh for the upcoming Assembly election in the state. pic.twitter.com/QgYc3t9hhC
— ANI (@ANI) November 3, 2023
కాగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రెండు దఫాల్లో జరగనున్నాయి. తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న, రెండో విడతలో మిగితా 70 స్థానాలకు 17న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications