వీల్ ఛైర్‌పై మమతా బెనర్జీ: గాయం తరువాత తొలిసారిగా జనం ముందుకు: భారీ రోడ్ షో
కోల్‌కత: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..తన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని పునఃప్రారంభించారు. కొద్దిసేపటి కిందటే ఆమె కోల్‌కతలో రోడ్ షోలో పాల్గొన్నారు. కాలికి గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె.. వీల్ చైర్‌పై రోడ్ షో నిర్వహిస్తున్నారు. కోల్‌కతలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద రోడ్ షో ప్రారంభమైంది. కాలికి గాయం కావడం వల్ల ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తరువాత.. మమతా బెనర్జీ పాల్గొననున్న తొలి రోడ్ షో ఇదే. మహాత్మాగాంధీ విగ్రహం నుంచి హజ్రా వరకు ఆమె ర్యాలీగా తరలి వెళ్లనున్నారు.
నందిగ్రామ్‌లో చోటు చేసుకున్న తోపులాట సందర్భంగా మమతా బెనర్జీ గాయపడిన విషయం తెలిసిందే. ఆమె కాలికి ఫ్రాక్చర్ అయింది. ఫలితంగా- తన నందిగ్రామ్ పర్యటనను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. మమతా గాయపడటాన్ని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తోంది. రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా ఆరోపించింది. మమత బెనర్జీపై దాడి చోటు చేసుకోలేదని, కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించిన ప్రత్యేక పరిశీలకులు తేల్చారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ నివేదికను అందజేశారు.

ప్రమాదవశావత్తూ మమతకు గాయాలయ్యాయని, కారు డోర్ తగలడం కాలికి దెబ్బ తగిలిందని తెలిపారు. మమతపై దాడి చోటు చేసుకుందనడానికి నిదర్శనంగా ఎలాంటి ఆధారాలు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన నివేదికలో పేర్కొన్నారు. కొద్దిసేపటి కిందటే మమతా బెనర్జీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది వీల్‌ఛైర్‌ను తోసుకుంటూ వేదిక వద్దకు వచ్చారు. కాలికి సిమెంట్ కట్టుతో కనిపించారామె. గాయమైన తన ఎడమకాలిని పూర్తిగా కింద పెట్టలేకపోతున్నారు. రోడ్ షో సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నుంచి హజ్రా వరకు తరలి వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

గంటకు పైగా మమతా బెనర్జీ రోడ్ షో కొనసాగుతుందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లడించారు. హజ్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ఏం మాట్లాడుతారనేది ఆసక్తి రేపుతోంది. గాయానికి కారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలేనంటూ ఇన్నాళ్లూ మమతా బెనర్జీ చెబుతూ వచ్చారు. తాజాగా- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదిక మాత్రం దీనికి భిన్నంగా ఉంటోంది. తాను గాయపడటానికి కారణమైన తోపులాటను బీజేపీ కార్యకర్తలే సృష్టించారనేది తృణమూల్ కాంగ్రెస్ నేతల వాదన.












Click it and Unblock the Notifications