ఎల్లుండే బై ఎలక్షన్! 'పెట్టి బామ.. పల్టీ బామ' వ్యాఖ్యలపై సీఎం సీరియస్
తమిళనాట ఉపఎన్నికల హీట్ పీక్స్ లోకి వెళ్లింది. ధరాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల వేళ తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా తీవ్ర వేడెక్కింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సీఎం విజయ్.. మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధరాపురం ఉపఎన్నిక ప్రచార సభలో టీవీకే మహిళా అభ్యర్థి పి.సత్యభామపై స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచంగా, వ్యక్తిగత విమర్శలతో కూడి ఉన్నాయని ఆరోపించారు. మహిళల్ని బాడీ షేమింగ్ చేస్తూ.. వారి వ్యక్తిత్వాన్ని ఎగతాళి చేస్తూ మాట్లాడటం స్టాలిన్ దిగజారుడుతనానికి నిదర్శనమని, డీఎంకే పార్టీని ఒక "దుష్టశక్తి"గా వర్ణిస్తూ సోషల్ మీడియా ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'పెట్టి బామ.. పల్టీ బామ' వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసనలు
శుక్రవారం ధరాపురంలో జరిగిన ప్రచార సభలో డీఎంకే అభ్యర్థి ఎస్. సుగణ్యకు మద్దతుగా మాట్లాడిన స్టాలిన్.. గతంలో అన్నాడీఎంకే నుంచి టీవీకేలోకి మారిన సత్యభామను ఉద్దేశించి "పెట్టి బామ", "పల్టీ బామ" అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై టీవీకే నాయకత్వం తీవ్రంగా మండిపడింది. ఇది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదని, ఒక దళిత మహిళా నేత రూపాన్ని ఎగతాళి చేస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలని ధ్వజమెత్తింది. మహిళలను పదే పదే అవమానించడం డీఎంకే డీఎన్ఏలోనే ఉందంటూ విజయ్ మండిపడ్డారు. తమిళనాడు ఆడపడుచులకు కొడుకుగా, సోదరుడిగా తాను ఈ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.

ఈసీ ఫిర్యాదుకు సిద్ధం: బహిరంగ క్షమాపణకు డిమాండ్
మరోవైపు టీవీకే ముఖ్య నాయకుడు సీటీఆర్ నిర్మల్ కుమార్ కోయంబత్తూర్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల బరిలో ఉన్న ఒక ఎస్సీ వర్గానికి చెందిన మహిళా అభ్యర్థిని ఈ విధంగా అవమానించడం అత్యంత శోచనీయమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించబోతున్నట్లు వెల్లడించారు. స్టాలిన్ తక్షణమే సత్యభామకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ డీఎంకే చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన, ఓటమి భయంతోనే డీఎంకే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.
అక్టోబర్ 6న పోలింగ్: ముక్కోణపు పోరులో ధరాపురం స్థానం
అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా ఉన్న పి. సత్యభామ తన పదవికి రాజీనామా చేసి, విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో చేరడంతో ఈ ధరాపురం ఉపఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఈ స్థానంలో టీవీకే తరఫున సత్యభామ, డీఎంకే తరఫున ఎస్. సుగణ్య, అన్నాడీఎంకే అభ్యర్థిగా కె. భానుమతి పోటీ పడుతున్నారు. ధరాపురంతో పాటు మధురాంతకం అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 6న ఇక్కడ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడే నాయకులకు ఓటర్లు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతారని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్ 9న ఫలితాలు వెలువడనున్నాయి.














Click it and Unblock the Notifications
