" లక్షల మందికి నష్టం చేస్తారా ?"- ఉపఎన్నికలపై మద్రాస్ హైకోర్టుకు విజయ్ ప్రశ్న..!
తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత వివిధ కారణాలతో ఖాళీ అయిన ఐదు శాసనసభ స్ధానాల్లో ఉప ఎన్నికల నిర్వహణ వ్యవహారం మద్రాస్ హైకోర్టులో మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఈ ఐదు స్ధానాల్లో ఎన్నికలు నిర్వహించాల్సిందేనని విజయ్ సర్కార్ పట్టుబడుతుంటే.. హైకోర్టు, ఈసీ మాత్రం ఆసక్తిచూపడం లేదు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఇవాళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
రాష్ట్రంలో విజయ్ (Vijay) రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ స్ధానంతో పాటు పెరుందురై, అంబసముద్రం, విరాలిమలై, కరూర్ సీట్లలో జూలై 10న ఉప ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్దం కాగా.. వీటిలో దాఖలైన ఎన్నికల పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయనే కారణంతో.. మద్రాస్ హైకోర్టు వాటికి జూలై 31 వరకూ బ్రేక్ వేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వును తదనంతరం సెప్టెంబర్ 8 వరకు పొడిగించారు. ఈలోగా సదరు నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల పిటిషన్లపై కోర్టు తుది నిర్ణయం వెలువడే వరకు అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. తాజాగా ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న సీఎం విజయ్ .. కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేశారు.

రాష్ట్రంలోని 5 నియోజకవర్గాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను ఆపేస్తే.. తమ ప్రయోజనాలు, సమస్యలు, అభ్యంతరాలను ప్రతిబింబించేలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను పొందే అవకాశం నుండి లక్షలాది మంది ప్రజలు అనిశ్చిత కాలం పాటు దూరమవుతారని సీఎం విజయ్ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఎటువంటి ప్రజా ప్రయోజనం లేదని, దురుద్దేశంతోనే దీనిని దాఖలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల పిటిషనర్ ఒకవేళ విజేతగా ప్రకటించబడితే, వారి ప్రయోజనాలను కాపాడటమే ఈ పిటిషన్ యొక్క ఏకైక ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ ఎన్నికలను నిలిపివేయడం వల్ల లక్షలాది మంది ప్రజలు ప్రభావితమవుతారని ఆయన వివరించారు. కాబట్టి దీన్ని కొట్టేయాలని హైకోర్టును విజయ్ కోరారు.














Click it and Unblock the Notifications