కర్ణాటకలో చాపకింద నీరులా- కోవిడ్ అడ్వైజరీ జారీ: మాస్కులు ధరించాలంటూ
Covid 19 variant JN.1: రెండు సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. క్రమంగా విజృంభిస్తోంది. కోవిడ్ 19 కొత్త వేరియంట్ జేఎన్.1 (Covid 19 variant JN.1) ఇప్పటికే కేరళలో తిష్టవేసింది. 79 సంవత్సరాల వృద్ధురాలు ఒకరు ఈ కొత్త వేరియంట్ బారిన పడి మరణించారు.
ఇతర రాష్ట్రాల్లోనూ కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు పుట్టుకొస్తోన్నాయి. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 335 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఆరుమంది మరణించారు. కేరళలో అయిదు కోవిడ్ మరణాలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లో ఒకరు కోవిడ్ బలి అయ్యారు.

కేరళలో కొత్త కేసులు నమోదువుతున్న నేపథ్యంలో పొరుగునే ఉన్న కర్ణాటక అప్రమత్తం అయింది. హెల్త్ అడ్వైజరీని జారీ చేసింది. చలి తీవ్రత పెరుగుతోండటం, ఉష్ణోగ్రత కనిష్ఠ స్థాయికి పడిపోతోండటంతో సీజనల్ వ్యాధులు మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని సూచించింది. ఎలాంటి అనారోగ్యకర సమస్యలు తలెత్తినా సొంత వైద్యానికి బదులుగా డాక్టర్లను సంప్రదించాలని పేర్కొంది.
ఈ మేరకు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూరావు ఓ ప్రకటన జారీ చేశారు. వయోధిక వృద్ధులు, దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా మాస్కులను ధరించాల్సి ఉంటుందని తెలిపారు. కొద్దిసేపటి కిందటే ఆయన కొడగులో విలేకరులతో మాట్లాడారు.
60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మాస్కులను ధరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గుండె, శ్వాసకోస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు, దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేషెంట్లు మాస్కులను ధరించాలని కోరారు. కోవిడ్‌ను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదని దినేష్ గుండూరావు చెప్పారు.
వృద్ధులు, గర్భిణీలు, రోగనిరోధక శక్తి లేనివారు, దీర్ఘకాలంగా వైద్య చికిత్సలను తీసుకుంటోన్న వారు ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని, దీనిపై త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేస్తామని మంత్రి అన్నారు. ఎలాంటి అనారోగ్యం కలిగినా డాక్టర్లను సంప్రదించాలని, ఆసుపత్రుల్లో అడ్మిట్ కావాలని కోరారు.
జ్వరం, చలి, ఆకలి లేకపోవడం, మైయాల్జియా, వికారం, తుమ్ములు, పొడి దగ్గు తగ్గకపోవడం, అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడం న్యుమోనియా సాధారణ లక్షణాలు అని, వీటితో బాధపడుతున్న వారు వెంటనే డాక్టర్లను లేదా సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం/ఆసుపత్రులను సంప్రదించాలని సూచించారు.












Click it and Unblock the Notifications