అల్లకల్లోలంగా బంగాళాఖాతం: పెను తుఫాన్ తీరం దాటేది ఇక్కడే
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. అల్పపీడనంగా మారింది. ఇది వచ్చే 24 గంటల వ్యవధిలో క్రమంగా వాయుగుండంగా అనంతరం అతి తీవ్ర తుఫాన్‌గా ఆవిర్భవించనుంది. దీని ప్రభావం ఏపీ సహా ఏకంగా మూడు రాష్ట్రాలపై ఉండబోతోంది.
మరింత బలపడ్డ ఆవర్తనం..
బంగాళాఖాతం తూర్పు- మధ్య ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ ఉత్తర తీరంంలో ఈ నెల 19వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇది అల్పపీడనంగా మారినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించిది. నేటి నుంచి దీని కదలికలు చురుగ్గా ఉంటాయని పేర్కొంది.

పేరు పెట్టిన ఖతర్..
వాతావరణ కేంద్రం వేసిన అంచనాల ప్రకారం- క్రమంగా ఈ అల్పపీడనం బంగాళాఖాతం మధ్య ప్రాంతానికి కదులుతుంది, అక్కడ వాయుగుండంగా మారుతుంది. అనంతర అతి తీవ్ర తుఫాన్‌గా ఆవిర్భవిస్తుంది. దీనికి దానా అని ఇదివరకే పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఖతర్ ఈ పేరును సూచించింది.
తీరం దాటేది ఇక్కడే..
దానా తుఫాన్ ఒడిశాలోని పూరీ- పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్ మధ్య తీరం దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. ఈదురు గాలుల తీవ్రత 140 నుంచి 160 కిలోమీటర్ల వరకూ పెరిగడానికీ అవకాశం ఉంది. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారు జామున తీరం తాకుతుంది.
అతి భారీ వర్షాలు..
దీని ప్రభావం వల్ల ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. తీరానికి సమీపించే కొద్దీ మూడు రాష్ట్రాలపై దానా తుఫాన్ ప్రభావం ఉధృతంగా ఉంటుంది. బుధవారం నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయి.
ఒడిశాలో ఎల్లో అలర్ట్..
ఒడిశాలోని తీర ప్రాంత జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ అయింది. భద్రక్, బాలాసోర్, జైపూర్, కేంద్రపారా, కటక్, జగత్‌సింగ్‌పూర్ రాయగడ, గజపతి, గంజాం, కొంధమాల్, నయాగఢ్, ఖుర్దా, పూరీ జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంతవాసులను ఖాళీ చేయిస్తోంది అక్కడి ప్రభుత్వం.
బెంగాల్‌పై పంజా..
పశ్చిమ బెంగాల్‌లో ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని కోల్‌కత, హౌరా, హుగ్లీ, ఉత్తర 24 పరగణా, పురూలియా, బాంకుర జిల్లాల్లో ఈ నెల 23, 24, 25 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.












Click it and Unblock the Notifications