యాస్ తుఫాను విలయం: పశ్చిమబెంగాల్, ఒడిశాలో భారీ విధ్వంసం, నలుగురు మృతి
కోల్‌కతా: యాస్ తుఫాను పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. ఈ రెండు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నష్టం జరిగింది. అనేక ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. బుధవారం ఉదయం తర్వాత యాస్ తుఫాను పశ్చిమబెంగాల్, ఒడిశాల మధ్య తీరం దాటిన విషయం తెలిసిందే.

యాస్ తుఫాను విలయం: నలుగురు మృతి
యాస్ తుఫాను సృష్టించిన విలయానికి పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. ముగ్గురు ఒడిశాలో ప్రాణాలు కోల్పోగా, ఒకరు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చనిపోయారు. తుఫాను నుంచి కాపాడిన వ్యక్తి ఆ తర్వాత మరణించారని సీఎం మమతా బెనర్జీ తెలిపారు.

కోటి మందికిపైగా యాస్ తుఫాను బాధితులు
సుమారు కోటి మంది ప్రజలపై ఈ యాస్ పెను తుఫాను ప్రతికూల ప్రభావం చూపిందని మమత బెనర్జీ పేర్కొన్నారు. మూడు లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. పూర్వ మిడ్నాప్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో సముద్రపు అలలు భీకరంగా విరుచుకుపడ్డాయి. దీంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.పశ్చిమబెంగాల్ లో సుమారు 15 లక్షల మందిని, ఒడిశాలో 5 లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పెను విధ్వంసం
పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వేగంగా వీస్తున్న గాలులతో భారీ విధ్వంసం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ తోపాటు ఇతర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. యాస్ తుఫాను బీభత్సం నేపథ్యంలో జార్ఖండ్ సర్కారు కూడా అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేసింది.
Recommended Video

కేంద్రం సాయం కోసం బెంగాల్, ఒడిశా వినతలు
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తుఫాను ప్రభావంపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు ఇప్పటికే తుఫాను ప్రభావిత రాష్ట్రాలైన బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. తుఫాను కారణంగా తమ రాష్ట్రాల్లో పెను విధ్వంసం జరిగిందని, కేంద్రం ఆదుకోవాలని బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు కోరుతున్నాయి. గుజరాత్ రాష్ట్రానికి తౌక్టే తుఫాను భారీ నష్టం మిగల్చడంతో కేంద్రం సాయంగా రూ. 1000 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications