ఐఐటీ తిరుపతి, వన్ఇండియాతో కెనడా సంస్థ 'డీప్‌స్పేషియల్' కీలక ఒప్పందాలు!
కెనడాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జియో-ఏఐ సంస్థ 'డీప్‌స్పేషియల్' ఇండియాలో తన విస్తరణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. 'టీమ్ కెనడా ట్రేడ్ మిషన్' పర్యటనలో భాగంగా భారతీయ సంస్థలైన 'ఐఐటీ తిరుపతి నవావిష్కార్ ఐ-హబ్ ఫౌండేషన్', డిజిటల్ వార్తా ప్లాట్‌ఫారమ్ 'వన్ఇండియా'(గ్రేనియం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్)లతో రెండు వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకుంది. 'డీప్‌స్పేషియల్' సంస్థ 'టీమ్ కెనడా ట్రేడ్ మిషన్' పర్యటన సందర్భంగా భారతీయ సంస్థలతో ఈ రెండు ఒప్పందాలు కుదిరాయి.
ముంబై, బెంగళూరు నగరాలకు దాదాపు 300 మంది కెనడియన్ ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించిన కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మనీందర్ సిధూ సమక్షంలో అక్టోబర్ 16న బెంగళూరులో ఈ ఒప్పందాలు కుదిరాయి. గ్లోబల్ అఫైర్స్ కెనడా ప్రకారం.. ఈ ట్రేడ్ మిషన్ ద్వారా కెనడా-భారతీయ సంస్థల మధ్య దాదాపు 300 మిలియన్ కెనడియన్ డాలర్ల అంచనా విలువ కలిగిన 34 వాణిజ్య ఒప్పందాలు, భాగస్వామ్యాలు, పెట్టుబడి ప్రకటనలు జరిగాయి. డీప్‌స్పేషియల్ కుదుర్చుకున్న ఈ రెండు ఒప్పందాలు అధికారిక మిషన్ ఫ్యాక్ట్ షీట్‌లోని సమాచార విభాగంలో నమోదయ్యాయి.
ఐఐటీ తిరుపతితో సాంకేతిక పరిశోధన, గ్లోబల్ మెంటార్షిప్
ఐఐటీ తిరుపతి ఇన్నోవేషన్ హబ్ తో కుదిరిన ఒప్పందం ప్రకారం.. డీప్‌స్పేషియల్, ఐఐటీ తిరుపతి సంస్థలు జియోస్పేషియల్ టెక్నాలజీస్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, పొజిషనింగ్ సిస్టమ్స్, స్పేషియల్ ఏఐ అంశాలపై సంయుక్తంగా పనిచేస్తాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన వాణిజ్యీకరణ, స్టార్టప్ ఇంక్యుబేషన్ వంటి కార్యక్రమాలు చేపడతారు. ఇందులో ప్రధానంగా డీప్‌స్పేషియల్ సంస్థకు చెందిన అంతర్జాతీయ జియో-ఏఐ మెంటార్షిప్ ప్రోగ్రామ్ 'ఎక్స్ప్లోర్'ను స్పిన్ ల్యాబ్స్ నెట్వర్క్ ద్వారా ప్రారంభించనున్నారు. లొకేషన్-ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన నిజమైన సవాళ్లను పరిష్కరించే దిశగా విద్యార్థులకు, యువ నిపుణులకు జియో-ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అంశాలపై ఆచరణాత్మక అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం

ఈ ఒప్పందంపై ఐఐటీ తిరుపతి టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ రోషన్ కె. శ్రీవాస్తవ, డీప్‌స్పేషియల్ సీఈవో డాక్టర్ రాహుల్ కుష్వాహా సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ తిరుపతి ఐ-హబ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ తులికా సహా, డీప్‌స్పేషియల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సౌరభ్ త్యాగి కూడా పాల్గొన్నారు.
తరగతి గదిలోకి జర్నలిజం
రెండో ఒప్పందంలో భాగంగా డీప్స్పేషియల్కు చెందిన మీడియా-లిటరసీ ప్లాట్‌ఫారమ్ 'ఎడ్స్క్ ఎక్స్‌ప్రెస్'కు వన్ఇండియా నిత్యం వార్తలను, సమకాలీన అంశాల కంటెంట్‌ను అందిస్తుంది. విద్యార్థులు సమాజంలో పెరుగుతున్న యదార్థం సంఘటనలపై అవగాహన పెంచుకోవడానికి, విశ్లేషణాత్మకంగా చదివే అలవాటును, విమర్శనాత్మక ఆలోచనా ధోరణిని, మీడియా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడటమే ఈ భాగస్వామ్య ప్రధాన లక్ష్యం. 'ఎడ్స్క్ ఎక్స్‌ప్రెస్' విధానం విద్యార్థులకు కేవలం నమ్మకమైన వార్తలను అందించడమే కాకుండా ఆ సమాచారాన్ని ప్రశ్నించేలా, సమకాలీన అంశాలపై తమ అవగాహనను పెంచుకునేలా, తమ సొంత సమాజంలోని కథనాలను స్వయంగా నివేదించేలా అవకాశాలను కల్పిస్తుంది.

ఈ ఒప్పందంపై వన్ఇండియా సీఈవో రావణన్ ఎన్, డీప్‌స్పేషియల్ సీఈవో డాక్టర్ రాహుల్ కుష్వాహా సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో వన్ఇండియా కంటెంట్ స్ట్రాటజీ అండ్ మోనెటైజేషన్ సీనియర్ డైరెక్టర్ జేమ్స్ పీజే, డీప్‌స్పేషియల్ సీఎంవో సౌరభ్ త్యాగి కూడా పాల్గొన్నారు.
వన్ఇండియా సీఈవో రావణన్ ఎన్ మాటల్లో..
వన్ఇండియా సీఈవో రావణన్ ఎన్ మాట్లాడుతూ.. "నమ్మకమైన వార్తలు కేవలం న్యూస్రూమ్కే పరిమితం కాకూడదు. అవి తరగతి గదులకు కూడా చేరాలి. వన్ఇండియాలో మేము కంటెంట్‌పైనే నిరంతరం పనిచేస్తుంటాం. ఈ క్రమంలో మేము పదే పదే గుర్తించే విషయం ఒకటే.. సమాజానికి మేలు చేసే సానుకూల వార్తలు ఏమాత్రం తక్కువ ప్రాధాన్యం ఉన్నవి కావు. ఓ యువ పాఠకుడికి సమాజంలో ఏది సరిగ్గా పనిచేస్తోంది. దాన్ని ఎవరు నడిపిస్తున్నారు అనేది తెలిసినప్పుడే మార్పు సాధ్యమేననే నమ్మకం ఏర్పడుతుంది. 'ఎడ్స్క్ ఎక్స్‌ప్రెస్'తో మేము చేస్తున్న పని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఇదే. విద్యార్థులు నిజమైన, విశ్వసనీయమైన పాత్రకేయ వార్తలను చదువుతారు. వాటిని ప్రశ్నిస్తారు, తమ సొంత సమాజంలోని కథనాలను స్వయంగా నివేదిస్తారు. సమాజంపై ప్రభావం చూపే జర్నలిజం చిన్న వయసు నుంచే ప్రారంభమవుతుంది" అని పేర్కొన్నారు.

30 ఏళ్లలో అతిపెద్ద వాణిజ్య మిషన్
గడిచిన మూడు దశాబ్దాలలో ఇండియాకు వచ్చిన అతిపెద్ద కెనడియన్ వాణిజ్య బృందంగా గ్లోబల్ అఫైర్స్ కెనడా దీనిని వెల్లడించింది. ఇండియాలో లభించే అత్యుత్తమ సాంకేతిక సామర్థ్యాలను, నిపుణులను ఉపయోగించుకుంటూ గ్లోబల్ స్థాయిలో పరిష్కారాలను అందించడమే తమ డీప్‌స్పేషియల్ వ్యూహమని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ రాహుల్ కుష్వాహా వెల్లడించారు.
ఇదిలా ఉండగా 'డీప్‌స్పేషియల్' ప్లాట్‌ఫారమ్ జియో-ఏఐ, ఏఐ-ఆధారిత నిర్ణయాత్మక మేధస్సును విద్య, వ్యవసాయం, ఆహార భద్రత, వాతావరణ, విపత్తు నిర్వహణ, అలాగే మౌలిక సదుపాయాల ప్రణాళిక వంటి వివిధ రంగాలలో ఉపయోగిస్తుంది. పరిశోధనా సంస్థలు, సాంకేతిక సంస్థలు, కంటెంట్ ప్రొవైడర్లతో భాగస్వామ్యాల ద్వారా తన సామర్థ్యాలను విస్తరించడం, నైపుణ్యాలను పెంపొందించడం, అంతర్జాతీయ సహకారంతో కెనడాలో అభివృద్ధి చేసిన సాంకేతికతను ప్రపంచవ్యాప్తం చేయడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.














Click it and Unblock the Notifications
