మొన్న కవిత- నేడు కేజ్రీవాల్: భారీ ఊరట
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు బెయిల్ లభించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు అరవింద్ కేజ్రీవాల్. తీహార్ జైలులో ఉంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారుల విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈడీ కేసులో ఆయనకు ఇదివరకే బెయిల్ లభించిన విషయం తెలిసిందే.

మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ గతంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పుడు తాజాగా సీబీఐ కేసులో కూడా కేజ్రీవాల్‌కు బెయిల్ లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన భారత్ రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా ఇప్పటికే బెయిల్‌పై విడుదల అయ్యారు.
మద్యం పాలసీ కుంభకోణంలో ఈ ఏడాది మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. తొలుత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. మూడు నెలల తరువాత సీబీఐ సైతం ఆయనను అరెస్ట్ చేసింది. ముఖ్యమంత్రి హోదాలో తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొన్నారు కేజ్రీవాల్.
బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఢిల్లీలోని రోస్ అవెన్యూ న్యాయస్థానం ఆయన బెయిల్ పిటీషన్లను ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చింది. ఈడీ, సీబీఐ అధికారుల జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. చివరికి బెయిల్ కోసం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. ఓ ప్రజా ప్రతినిధిగా, ఓ జాతీయ పార్టీకి కన్వీనర్ అనే హోదాను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి అప్పట్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తరువాత ఆయన మళ్లీ కోర్టుకు లొంగిపోయారు.
ఇప్పుడు సీబీఐ కేసులో కూడా బెయిల్ లభించడం ఊరట కల్పించినట్టయింది. మద్యం పాలసీ కుంభకోణంలో బెయిల్ లభించిన నాలుగో రాజకీయ నాయకుడు ఆయనే. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతలు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు బెయిల్ లభించింది.












Click it and Unblock the Notifications