నెల్లూరు- చెన్నై తీరం వైపు దూసుకొస్తోన్న వాయుగుండం
Chennai rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. వాయుగుండంగా మారింది. తీరం వైపు తరుముకొస్తోంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తమిళనాడు ఉత్తరం- ఏపీ దక్షిణ ప్రాంతంలో తీరాన్ని దాటుతుందని తెలిపింది.
ప్రస్తుతం ఈ వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇది వాయవ్య దిశగా కదులుతోంది. ఆ సమయంలో దీని వేగం గంటకు 15 కిలో మీటర్ల వరకు ఉంటోంది. ఈ ఉదయం వరకు చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 320 కిలో మీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఈశాన్య దిశగా 350, నెల్లూరుకు ఆగ్నేయ దిశగా 400 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

గురువారం తెల్లవారు జామున పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెన్నైలోని భారత వాతావరణ కేంద్రం రీజినల్ డైరెక్టర్ ఎస్ బాలచంద్రన్ తెలిపారు. ఈ వాయుగుండం కదలికలు క్రమంగా పశ్చిమ- వాయవ్య దిశగా సాగుతున్నాయని, చెన్నైకి సమీపంలో తీరాన్ని దాటొచ్చనీ పేర్కొన్నారు. ఇప్పుడున్న వాయుగుండం తుఫాన్‌గా మారే అవకాశం లేదని చెప్పారు.
దీని ప్రభావంతో ఏపీలో ఇప్పటికే అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాలు తడిచి ముద్దయ్యాయి.
అటు తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రత్యేకించి- ఉత్తర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లు అతలాకుతలమౌతోన్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
24 గంటల వ్యవధిలో తిరువళ్లూర్ జిల్లాలో అత్యధికంగా 302.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చెన్నై రెడ్ హిల్స్ లేక్- 279.2, చెంబరంబాక్కం- 85, కన్నన్‌కోట్టై థెరాయ్ కండిగై- 62, పూండి- 60, వీరానం లేక్- 50.20 పరిసర ప్రాంతాల్లో మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది.
వర్షాల వల్ల చెన్నై వేలాచెరి తీవ్రంగా నష్టపోయింది. ఈ ఒక్క ప్రాంతంలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడున్న వాళ్లందరూ తమ వాహనాలు మునిగిపోకుండా వాటిని వేలాచెరి బ్రిడ్జిపై పార్క్ చేయడం కనిపించింది. ఇక్కడ 1,500లకు పైగా నివాసాలు నీట మునిగాయి. కోడంబాక్కం, వడపళని, వళ్లువర్ కోట్టం, ఎగ్మూర్, అన్నా నగర్, తిరుమంగళం, ముకాప్పర్, కోయంబేడు, పెరంబూర్‌లల్లో అసాధారణ వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications