వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొరంగం తవ్వి రైలింజిన్‌ను దొంగిలించారా....అసలేం జరిగింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రైలింజన్

బిహార్‌లోని బరౌనీలో సొరంగం తవ్వి రైలు ఇంజిన్‌ను దొంగిలించారనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

దొంగలు కొన్ని మీటర్ల లోతు సొరంగం తవ్వి ఇంజిన్‌ను మాయం చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. తరువాత, ఈ ఇంజిన్‌ను స్క్రాప్‌గా విక్రయించారనే వార్త కూడా వచ్చింది.

చోరీ జరిగినట్టుగా చెబుతున్న ప్రాంతం తూర్పు మధ్య రైల్వే కిందకు వస్తుంది.

ఈ వార్తల్లో నిజానిజాలు తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఇందుకోసం హాజీపూర్‌లోని తూర్పు మధ్య రైల్వే అధికార ప్రతినిధి వీరేంద్ర కుమార్‌ని సంప్రదించింది.

సొరంగం తవ్వి రైలు ఇంజిన్‌ను దొంగిలించారనే వార్త పూర్తిగా నిజం కాదని వీరేంద్ర కుమార్‌ తెలిపారు. అయితే, రైల్వే ఇంజిన్లలోని విలువైన వస్తువులను దొంగిలించారని తెలిపారు.

"సొరంగం తవ్వి ఇంజిన్‌ను దొంగిలించారనేది పూర్తిగా తప్పుడు వార్త. సొరంగం తవ్వి కారునే దొంగిలించలేరు. ఇక రైలు ఇంజిన్‌ను ఎలా దొంగిలిస్తారు? దొంగలు ఇంజిన్ గోడలు బద్దలుగొట్టి, లోపలి భాగాలను దొంగిలించారు. వాటిలో 95 శాతం భాగాలను రైల్వే బృందం తిరిగి స్వాధీనం చేసుకుంది" అని ఆయన తెలిపారు.

దొంగతనం జరిగిన ఇంజిన్ ఒక డీజిల్ ఇంజన్ అని, కొంతకాలం క్రితం వరకు వాడుకలో ఉన్నదేనని ఆయన చెప్పారు.

ఈ విషయంపై రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంజిన్ చోరీ అయిందన్న వార్త అబద్ధమని రైల్వే శాఖ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు.

బిహార్‌లోని బరౌనీ రైల్వే స్టేషన్

ఇంతకీ ఏం జరిగింది?

ఈ ఘటన బరౌనిలోని గఢ్‌హరా లోకోమోటివ్ షెడ్‌లో జరిగింది. ఇక్కడి యార్డులో సుమారు 16 రైల్వే ఇంజన్లను ఉంచారు. చాలా ఇంజిన్లను మెయింటెనెన్స్ కోసం ఈ షెడ్‌లో ఉంచుతారు.

ఒక్కోసారి ఇంజిన్లను ఇప్పట్లో వాడే అవసరం లేదనుకున్నా కూడా లోకోమోటివ్ షెడ్‌లో ఉంచుతారు.

పాత రైల్వే ఇంజన్లను ఎప్పటికప్పుడు స్క్రాప్‌గా అమ్మేస్తారు. కొన్నిసార్లు కొన్ని కంపెనీలు చిన్న చిన్న పనుల కోసం పాత ఇంజిన్లను కొనుగోలు చేస్తాయి.

విద్యుత్ ప్లాంట్లు లేదా పెద్ద పెద్ద కర్మాగారాలలో తేలికపాటి లేక తక్కువ దూరం రవాణా కోసం రైల్వే ఇంజిన్లను ఉపయోగిస్తారు.

ఇందుకోసం పాత రైల్వే ఇంజిన్లను కొనుగోలు చేస్తారు. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు కూడా పాత ఇంజిన్లను కొనుగోలు చేస్తాయి.

భారతదేశంలో రైల్వే ఆస్తుల రక్షణ బాధ్యత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) చేతిలో ఉంటుంది.

బిహార్‌లోని బరౌనీ రైల్వే స్టేషన్

గతంలో రైల్వే ఆస్తులను దొంగిలించిన ఘటనలు జరిగినట్లు రిపోర్టులు వచ్చాయి.

రైల్వే ట్రాకులు ఓపెన్‌గా ఉంటాయి కాబట్టి, వాటిని చేరుకోవడం పెద్ద కష్టం కాదు. అందుకే ముఖ్యమైన ప్రదేశాల్లో ఆర్పీఎఫ్ భద్రతా సిబ్బందిని మోహరిస్తుంది.

ఇది కాకుండా, ఎప్పటికప్పుడు ముఖ్యమైన ప్రదేశాలలో ఆర్పీఎఫ్ తనిఖీలు నిర్వహిస్తుంది.

పదిహేను రోజుల క్రితం గఢ్‌హరా లోకో షెడ్‌లో చోరీ జరిగిందన్న విషయం రైల్వేశాఖకు తెలిసింది.

గతంలో కూడా ఈ షెడ్‌లో దొంగతనాలు జరిగాయని, రైల్వే ఆస్తులు మాయమయ్యాయనే ఆరోపణలు న్నాయి.

నవంబర్ 7వ తేదీన రైల్వే శాఖ జరిపిన తనిఖీలలో గఢ్‌హరా యార్డు గోడ పగలగొట్టినట్టు గుర్తించారు. ఆ ప్రాంతంలో అనేక పాదముద్రలు కనిపించాయి.

వెంటనే, ఆర్పీఎఫ్, సంబంధిత ఇంజనీర్‌కు ఫోన్ చేసి అన్ని ఇంజిన్లను తనిఖీ చేయమని కోరింది. పాత రైల్వే ఇంజిన్లలోని కొన్ని భాగాలు, ముఖ్యంగా మోటారు తీగలను తెంపి ఎత్తుకెళ్లిపోయినట్లు గుర్తించారు.

వీటిలో వాడే రాగి, అల్యూమినియం తీగలకు స్క్రాప్‌లో కూడా చాలా విలువ ఉంటుంది. ఇనుప తీగలు మాత్రం చౌకగా అమ్ముడుపోతాయి.

సుమారు రూ. 14 లక్షల విలువైన ఆస్తి చోరీ.. దోషులను ఎలా పట్టుకున్నారు?

రైల్వే ఆస్తుల దొంగతనం జరిగిందని స్పష్టమయ్యాక, రైల్వే, విజిలెన్స్ బృందాలు రాత్రిపూట రహస్యంగా కాపు కాసి, కొంతమంది దొంగలను పట్టుకున్నాయి. వారిని ప్రశ్నించి , వారి మొబైల్ వివరాలను పరిశీలించారు.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తెలిపిన వివరాల ప్రకారం, ముందుగా గుడ్డూ కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. అతడు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా విజిలెన్స్ బృందం చేతికి చిక్కాడు. కానీ, మరో అయిదుగురు తప్పించుకున్నారు.

రెండు వారాలు కాపు కాసి, ఒకరి నుంచి మరొకరిని, వారి నుంచి ఇంకొకరిని.. ఇలా మొత్తం దోషులందరినీ పట్టుకున్నారు.

ముజఫ్ఫర్‌పూర్‌కు చెందిన సన్నీ కుమార్ అనే వ్యక్తి, దొంగిలించిన వస్తువులతో పాటు పట్టుబడ్డాడు.

ఈ ఘటనలో సుమారు రూ. 14 లక్షల విలువైన వస్తువులు, వైర్లు చోరీకి గురైనట్లు అంచనా వేశారు.

అందులో ఎక్కువ భాగం బిహార్‌లోని ముజఫ్ఫర్‌పూర్‌లోనే అమ్మినట్టు తేలింది.

దొంగిలించిన వస్తువులలో సుమారు రూ. 11 లక్షల విలువైన వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది.

రైల్వే ఆస్తుల దొంగతనానికి శిక్ష

ఈ కేసులో తుది సమాచారం అందే సమయానికి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా బిహార్‌లోని బెగుసరాయ్ జైలులో ఉన్నారు. మరో అయిదుగురు నిందితులపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వీరిని వెతుకుతున్నారు.

ఈ కేసు బెగుసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. వారిపై ఆర్‌పీయూపీ (రైల్వే ఆస్తుల చట్టవిరుద్ధమైన స్వాధీనం) చట్టంలోని సెక్షన్ 3 'ఏ' కింద కేసు నమోదు చేశారు.

ఆర్‌పీయూపీ చట్టం అనేది రైల్వే ఆస్తుల అక్రమ స్వాధీనానికి సంబంధించిన చట్టం. ఈ రకమైన నేరానికి మూడు నుంచి అయిదు సంవత్సరాల శిక్ష పడవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Did they dig a tunnel and steal a rail engine....what happened?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X