మంత్రి ముందు మహిళల డ్యాన్స్: వైరల్ వీడియోతో డీఎంకేకు భారీ షాక్!
Viral Video: తమిళనాడులో పాలక డీఎంకే మంత్రి ఎస్.పెరియకరుప్పన్‌కు సంబంధించిన ఓ వైరల్ వీడియో తీవ్ర రాజకీయ కలకలం రేపుతోంది. మంత్రి ముందు యువతుల నృత్య ప్రదర్శకు సంబంధించిన ఆ వీడియో అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. శివగంగై జిల్లాలో ఉదయనిధి స్టాలిన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆ యువతులు డ్యాన్స్ చేశారు. ఆ వీడియోలో మంత్రి ఎస్.పెరియకరుప్పన్ యువతుల నృత్య ప్రదర్శనను చూస్తూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కనిపించారు.
మంత్రి మహిళలను తన ముందు డ్యాన్స్ చేయమని ఆదేశించారని, ఈ చర్య తమిళ సంస్కృతి, మహిళల గౌరవానికి భంగం కలిగించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ ఘటన డీఎంకే పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టగా.. ప్రతిపక్షాలైన బీజేపీ, ఏఐఏడీఎంకే ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించాయి.

ఇది పూర్తిగా సిగ్గుచేటు: బీజేపీ
"కేవలం వినోదం, ఉల్లాసం కోసం ప్రభుత్వ పదవిని ఎందుకు చేపట్టాలి? ఎటువంటి అర్హతలు లేకుండా, కేవలం వంశపారంపర్యంగా ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఒక వ్యక్తి పుట్టినరోజును సీనియర్ మంత్రులు జరుపుకోవడం దాస్యం యొక్క పరాకాష్ట కాదా?" అని బీజేపీ 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేసింది. "అందులో ఆ కార్యక్రమాన్ని అశ్లీల ప్రదర్శనగా మార్చి, దానిని అభినందించడం ఎంత పెద్ద అవమానం? అలాంటి వారికి ఆత్మగౌరవం లేదా హేతుబద్ధమైన ఆలోచన గురించి మాట్లాడే అర్హత ఉందా?" అని బీజేపీ ప్రశ్నించింది.సగం దుస్తుల్లో ఉన్న మహిళలను పిలిపించి, డ్యాన్స్ చేయించి, చప్పట్లు కొట్టి ఆనందించే డీఎంకే నాయకులపై ఆధారపడాల్సి వస్తే తమిళనాడులోని మహిళలు తమ ఫిర్యాదులను ఎవరికి చెప్పుకోగలరని అని ప్రశ్నించింది. "తమిళనాడులో శాంతిభద్రతల లోపాలు, ఆరోగ్య లోపాలు, అవినీతి, అక్రమాలతో ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే దెబ్బతింది. ముఖ్యమంత్రి నుంచి సీనియర్ మంత్రుల వరకు అందరూ ఇటువంటి వినోదంపై మాత్రమే దృష్టి పెడితే - అది పూర్తిగా సిగ్గుచేటు కాదా?" అని బీజేపీ విమర్శించింది.
கேளிக்கைகளில் மட்டுமே மூழ்கி களிப்புறுவதற்கு அரசுப் பதவி எதற்கு?
— BJP Tamilnadu (@BJP4TamilNadu) November 27, 2025
எவ்வித தகுதியுமின்றி வாரிசு அடிப்படையில் மட்டுமே இன்று துணை முதல்வர் பதவியில் அமர்ந்திருக்கும் ஒருவரின் பிறந்தநாளை மூத்த அமைச்சர்கள் கொண்டாடுவது என்பதே அடிமைத்தனத்தின் உச்சம். இதில் அந்த விழாவை ஆபாச விழாவாக மாற்றி… pic.twitter.com/TaVud0aksU
ఏఐఏడీఎంకే స్పందన:
ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ మాట్లాడుతూ.. పెరియకరుప్పన్‌కు మహిళలకు సంబంధించి వివాదం రావడం ఇది మొదటిసారి కాదని గుర్తు చేశారు. పదేళ్ల క్రితం ఆయన పాల్పడిన అనైతిక చర్యకు సంబంధించిన వీడియో కూడా ఎన్నికల ప్రచారంలో బయటకు వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఘటన డీఎంకే ఎన్నుకోబడిన ప్రతినిధుల ఆలోచనా ధోరణిని, మహిళలను గౌరవంగా చూడని పార్టీ ప్రాధాన్యతలను రుజువు చేస్తుందని ఆయన విమర్శించారు.
డీఎంకే వర్గాల వివరణ
మంత్రి మహిళలను డ్యాన్స్ చేయమని అడిగారనే ఆరోపణలను డీఎంకే వర్గాలు ఖండించాయి. ఆ మహిళలు తమంతట తాముగా స్టేజ్ దిగి వచ్చి మంత్రి ముందు డ్యాన్స్ చేయడం ప్రారంభించారని ఆ వర్గాలు సమర్థించుకున్నాయి. ఏఐఏడీఎంకే కూడా గతంలో ఇటువంటి నృత్య ప్రదర్శనలు నిర్వహించిందని డీఎంకే వర్గాలు ఆరోపించాయి.












Click it and Unblock the Notifications