రాజకీయ రొంపిలోకి దిగను: అన్నా హజారే, బేడీపై నో కామెంట్స్
ముంబై: అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తనతో కలిసి పనిచేసిన మాజీ ఐపిఎస్ అధికారిణి కిరణ్ బేడీ బిజెపిలో చేరిన అంశంపై స్పందించడానికి సామాజిక వేత్త అన్నా హజారే నిరాకరించారు. రాజకీయలంటేనే రొంపని, వాటి గురించి మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని మీడియాతో అన్నారు. కిరణ్ బేడీ బిజెపిలో చేరికపై మీడియా ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు.
‘మురికి రాజకీయాలపై నేనేమీ మాట్లాడను. వాటిపై స్పందించడం కూడా నాకు ఇష్టం ఉండదు' అని హజారే స్పష్టం చేశారు. బేడీ ఫోన్ చేసినా హజారే నుంచి ఎలాంటి స్పందనా లేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆమె బిజెపిలో చేరేముందు తనతో సంప్రదించలేదని కూడా అహ్మద్‌నగర్ జిల్లాలోని సొంతూరు రాలెగావ్ సిద్ధిలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

‘జన లోక్‌పాల్‌పై ఏ రూపంలో ఆందోళన చేపట్టాలన్న దానిపై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటా'నని ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నా హజారే బదులిచ్చారు. ఏం చేపట్టినా ఆ ఎన్నికల తర్వాతేనని ఆయన అన్నారు. బేడీ బిజెపిలో చేరికపై మీడియా పదేపదే ప్రశ్నించగా ‘ఆ విషయంపై నేనేమీ మాట్లాడను' అని హజారే స్పష్టం చేశారు.
తాను రాజకీయాల్లో ప్రవేశించే విషయంపై హజారేతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ఇంతకుముందు కిరణ్ బేడీ వెల్లడించారు. అయితే బేడీ ఫోన్ చేస్తే హజారే మాట్లాడడానికి నిరాకరించారు. ఆమె నిర్ణయం పట్ల హజారే తీవ్ర మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications