ఫాస్టాగ్ వార్షిక పాస్ లపై వాహనదారులకు సూచనలు..!!
ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను కొనుగోలు చేయాలని లేదా దాన్ని రీఛార్జి చేసుకోవాలని భావిస్తోన్న వాహనదారుల కోసం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అఅధికారులు కీలక సూచనలు జారీ చేశారు. ఇటీవల ఆన్‌లైన్ మోసాల ద్వారా వాహన యజమానులను లక్ష్యంగా చేసుకుంటున్న కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సూచనలు ఇచ్చారు. ఆర్థిక నష్టాలు మాత్రమే కాకుండా, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి కూడా దారితీస్తుందని, ఫాస్టాగ్ కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
అనేక నకిలీ వెబ్‌సైట్లు, అనధికారిక లింకులు ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌లను అందిస్తున్నాయని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఇలాంటి మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దని సూచించారు. ఫాస్టాగ్ కొనడానికీ లేదా వాటిని రీఛార్జి చేసుకోవడానికి ఇటువంటి అనధికారిక వెబ్ సైట్లను ఆశ్రయించడం వల్ల గరిష్టంగా 3,000 రూపాయలను నష్టపోవాల్సి ఉంటుందని అన్నారు. దీంతో పాటు వ్యక్తిగత సమాచారం సైతం దుర్వినియోగం కావచ్చని చెప్పారు.

రాజ్‌మార్గ యాత్ర మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఫాస్టాగ్ వార్షిక పాస్ లను కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ఇతర వెబ్‌సైట్లు, సోషల్ మీడియా, సందేశాలు లేదా లింక్‌ల ద్వారా ఈ పాస్‌లను విక్రయిస్తున్నారన్న ప్రకటనలు పూర్తిగా అవాస్తవమని NHAI స్పష్టం చేసింది. మోసగాళ్లు అసలు లింక్‌లను పోలిన ఫేక్ లింకులను సృష్టించి వాహనం, చెల్లింపుదారుల వివరాలను సేకరిస్తున్నారని, వీటిపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.
నకిలీ ఫాస్టాగ్ పాస్ కు సంబంధించిన ఫిర్యాదులు ఇటీవల గణనీయంగా పెరిగాయి. ఈ పరిణామాల మధ్య ఎన్ హెచ్ఏఐ తన ఎక్స్ అకౌంట్ లో ఓ బహిరంగ హెచ్చరికను జారీ చేసింది. ఫాస్టాగ్ వార్షిక పాస్‌లను విక్రయించడానికి ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు అనుమతి లేదని స్పష్టం చేసింది. నకిలీ లింక్‌లలో వాహన నంబర్, ఫాస్టాగ్ వివరాలు లేదా చెల్లింపు సమాచారాన్ని నమోదు చేయడం వల్ల మోసం జరిగే ప్రమాదం పెరుగుతుందని తాము గుర్తించినట్లు తెలిపింది.
ఫాస్టాగ్ కొనుగోలు లేదా రీఛార్జ్.. అధికారిక బ్యాంక్ యాప్‌ల ద్వారా లేదా NPCI MyFASTag పోర్టల్ ద్వారా మాత్రమే చేయాలి. కాల్స్, ఎస్‌ఎంఎస్, వాట్సాప్ ద్వారా QR కోడ్‌లను స్కాన్ చేయమని లేదా లింక్‌లను క్లిక్ చేయమని కోరే సందేశాలను విశ్వసించకూడదు. ప్రతి ఫాస్టాగ్ లావాదేవీకి ఎస్‌ఎంఎస్ లేదా ఈమెయిల్ అలర్ట్‌లను ఆన్ చేసుకొని, బ్యాలెన్స్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. తెలియని వారికి OTP, ఫాస్టాగ్ నంబర్ లేదా వాహన వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు.












Click it and Unblock the Notifications