Vande Bharat: 5 వందేభారత్ రైళ్ల రికార్డు..! 130 కిలోమీటర్ల స్పీడ్ తోనే మొత్తం ప్రయాణం..!
కరోనాకు ముందు నిస్తేజంగా ఉన్న భారతీయ రైల్వే వ్యవస్థకు చురుకుదనం తెచ్చిన రికార్డు నిస్సందేహంగా వందే భారత్ రైళ్లదే. స్వాతంత్ర భారతం అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ అందుబాటులోకి వచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లపై ఎన్నో విమర్శలు వచ్చినా వాటిని తట్టుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో భారతీయ రైల్వే పట్టాలపై వాటి గరిష్ట వేగం 130 కిలోమీటర్లను క్రమం తప్పకుండా ఫాలో అవుతున్న సర్వీసులు కూడా ఉన్నాయి.
మన దేశంలో వందే భారత్ అయినా, ఏ ఇతర రైలు అయినా ఒకే వేగంతో పూర్తి ప్రయాణం సాగించడం అరుదైన విషయం. ఎందుకంటే మలుపులతో పాటు పట్టాల స్థిరత్వం, ఇతర అంశాలు వీటికి అడ్డంకిగా ఉంటాయి. అయితే ఈ అడ్డంకుల్ని దాటుకుని మరీ దేశంలో వందే భారత్ రైళ్లు తమ ప్రయాణం మొత్తం 130 కిలోమీటర్ల గరిష్ట వేగంతోనే ప్రయాణిస్తే అది కచ్చితంగా ఆసక్తికరమైన అంశమే. ఇప్పుడు మన దేశంలో ఐదు వందే భారత్ రైళ్లు ఈ రికార్డు సృష్టించాయి.

2019లో ప్రారంభమైనప్పటి నుండి పూర్తి ఆక్యుపెన్సీలతో నడుస్తున్నన్న వందేభారత్ రైళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 150 సర్వీసులకు చేరాయి. ఇందులో 75 అప్ సర్వీసులు, మరో 75 డౌన్ సర్వీసులు ఉన్నాయి. చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధి చేసిన ఈ వందే భారత్ రైళ్లు ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు ఇంటర్‌సిటీ కనెక్టివిటీని గణనీయంగా పెంచాయి. వాస్తవానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. అయితే రైలు వేగం ట్రాక్ యొక్క దూరం, మార్గంలో స్టాప్‌లు, స్థానికంగా నిర్వహణ పనుల ఆధారంగా ఇవి 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి.

ఈ లెక్కన చూస్తే బిలాస్‌పూర్-నాగ్‌పూర్-బిలాస్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 20825/20826), హౌరా-పాట్నా-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 22347/22348), అహ్మదాబాద్-ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 22962/22961), హౌరా-గయ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 22303/22304), నాగ్‌పూర్-సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 20101/20102) సర్వీసులు తమ మొత్తం ప్రయాణాన్ని 130 కిలోమీటర్ల స్థిరమైన వేగంతో ప్రయాణిస్తున్నట్లు తేలింది. మిగతా రైళ్లు 130 కి.మీ వేగంతో వెళ్తున్నా పూర్తి ప్రయాణం కాదు.












Click it and Unblock the Notifications