బెంగళూరు రెస్టారెంట్ లో ఫుడ్ డెలివరీ బాయ్స్ కు లిఫ్ట్ బ్యాన్: దడదడలాడించిన సోషల్ మీడియా
బెంగళూరులోని ఓ రెస్టారెంట్.. స్విగ్గి, జొమాటో వంటి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సిబ్బందికి లిఫ్ట్ వాడకాన్ని నిషేధించిన సంఘటన తీవ్ర వివాదానికి రాజుకుంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, రెస్టారెంట్ యాజమాన్యం చివరకు బహిరంగ క్షమాపణలు చెప్పక తప్పలేదు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఓ రెడిట్ యూజర్ పోస్ట్ చేసిన ఓ ఫొటో.. ఆ రెస్టారెంట్ యాజమాన్యం వైఖరిని బయటపెట్టింది.
బెంగళూరులో టాప్ చైన్ రెస్టారెంట్లల్లో ఒకటైన మేఘనా ఫుడ్స్ లో చోటు చేసుకున్న ఉదంతం ఇది. లిఫ్ట్ లో రావడానికి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సిబ్బందికి అనుమతి లేదంటూ ఓ నోటీసును అతికించింది. దీన్ని ఓ రెడిట్ యూజర్ ఫొటో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్ పై పోస్ట్ చేశాడు. "గమనిక- స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ లిఫ్ట్‌లో రావడానికి అనుమతి లేదు. దయచేసి మెట్లను ఉపయోగించండి. ధన్యవాదాలు.." అని ఇంగ్లీష్ లో రాసి ఉండటం ఈ ఫొటోలో చూడొచ్చు.

పోస్ట్ అయిన వెంటనే ఈ ఫొటో వైరల్ అయింది. పలువురు నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. రిప్లైలు పెట్టారు. రెస్టారెంట్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారానికి పెరగానికి దోహదపడే వారిని అవమానిస్తోన్నారని విమర్శించారు. రోజూ రెస్టారెంట్ కు వచ్చే వారినే లిఫ్ట్ ఎక్కి రావొద్దనడం హాస్యాస్పదమని, మూర్ఖత్వమని ఓ ఒక యూజర్ వ్యాఖ్యానించాడు. వర్గ వివక్షకు రెస్టారెంట్ యాజమాన్యం పాల్పడిందని మరో యూజర్ కామెంట్ చేశాడు.
ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో మేఘనా ఫుడ్స్ దిగొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తమ డెలివరీ పార్ట్ నర్స్ కు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నామని పేర్కొంది. డెలివరీ సిబ్బందికి మరింత మెరుగైన సేవలు అందిస్తామని, వారికి ఎటువంటి లోటూ రానివ్వబోమని తెలిపింది. లిఫ్ట్ రావొద్దని చెప్పడం పొరపాటేనని అంగీకరించింది. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరుగనివ్వబోమని తెలిపింది.
రద్దీని తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే నోటీసు పెట్టినట్లు రెస్టారెంట్ ప్రకటనలో వివరించింది. రోజువారీ వినియోగదారులు ఎక్కువమంది లిఫ్ట్ ను ఉపయోగించుకోవాలనే కారణంతో ఈ నోటీసును అతికించాల్సి వచ్చిందని, ఈ చర్య డెలివరీ సిబ్బందికి అసౌకర్యాన్ని కలిగించిందని, అగౌరవ పరిచినట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించింది. ఈ పోస్టర్‌ను వెంటనే తొలగించామని డెలివరీ భాగస్వాములు అంటే తమకు గౌరవం ఉందని పేర్కొంది.












Click it and Unblock the Notifications