పొరుగు రాష్ట్రంలో విస్తరిస్తోన్న ప్రమాదకర సిండ్రోమ్- ఒకరి మృతి: వెంటిలేటర్‌పై పదుల సంఖ్యలో
Guillain-Barre Syndrome: మరో ముప్పు ముంచుకొచ్చింది. ఓ సరికొత్త సిండ్రోమ్ ప్రమాదకరంగా పరిణమించింది. భారత్‌లో శరవేగంగా విస్తరిస్తోంది. ఈ సిండ్రోమ్ బారిన పడి ఒకరు మరణించడం దీని తీవ్రతకు అద్దం పట్టినట్టయింది. ఇది సోకిన పలువురు వెంటిలేటర్లపై ఉన్నారు. మృత్యువుతో పోరాడుతున్నారు. 111 కేసులు నమోదయ్యాయి.
దీని పేరు గిలియన్- బార్రె సిండ్రోమ్. నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందిది. దీని పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ నెల మొదటివారంలో మహారాష్ట్రంలోని పుణేలో తొలి కేసు నమోదైంది. ఆ తరువాత శరవేగంగా విస్తరించింది. చివరి వారం నాటికి 111 కేసులు రికార్డయ్యాయి.

దీని బారిన పడి పుణేలో 41 సంవత్సరాల వ్యక్తి ఒకరు మరణించాడు. మృతుడు- వృత్తిరీత్యా ఛార్టెడ్ అకౌంటెంట్. ఓ వ్యక్తి గిలియన్- బార్రె సిండ్రోమ్ బారిన పడి మరణించడం ఇదే తొలిసారి. జీబీ సిండ్రోమ్ వల్లే అతను మరణించినట్లు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ధారించింది కూడా.
డయేరియాతో బాధపడుతూ ఆరు రోజుల కిందట అతను పుణేలో ఓ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ట్రీట్‌మెంట్ పొందుతున్నాడు. సోమవారం రాత్రి అసాధారణంగా అతని ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తొలుత పక్షవాతం, అనంతరం శ్వాస సంబంధిత ఇబ్బందికి గురై మృతిచెందినట్లు చెప్పారు.
కాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా వల్ల గిలియన్-బార్రె సిండ్రోమ్‌కు గురవుతారు. కలుషిత ఆహారం లేదా నీటి ద్వారా ఇది సంక్రమిస్తుంది. ఈ సిండ్రోమ్- శరీర రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. దీని బారిన పడ్డ్ వారు నీరసానికి గురి అవుతారు. క్రమంగా ఇది పక్షవాతానికి దారితీస్తుంది.
ముంబై, పూణే, షోలాపూర్, కొల్హాపూర్, నాగ్‌పూర్‌లల్లో ఈ సిండ్రోమ్ కేసులు అధికంగా నమోదయ్యాయి. నాగ్‌పూర్‌లో ఆరు కేసులు రికార్డయ్యాయి. దీనితో నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలను చేపట్టారు.
ఈ సిండ్రోమ్ మహారాష్ట్ర అంతటా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దీని ప్రభావాన్ని అరికట్టడానికి ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకుంది. దీని బారిన పడ్డ వారికి సకాలంలో చికిత్స అందించడానికి, సిండ్రోమ్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రత్యేకంగా డాక్టర్ల బృందాలను నియమించింది. స్థానిక మున్సిపల్ అధికారులతో కలిసి ఈ బృందాలు పని చేస్తాయి.












Click it and Unblock the Notifications