44 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసుల వృథా: తమిళనాడు టాప్, ఆ జాబితాలో తెలంగాణ కూడా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇదే సమయంలో పలు రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. అయితే, కొన్ని రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్లను ఎక్కువగా వృథా చేయడం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా వ్యాక్సిన్ డోసుల వృథాలో తమిళనాడు టాప్
ఏప్రిల్ 11 వరకు రాష్ట్రాలకు ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్లలో 23 శాతం డోసులు వృథా అయినట్లు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. కరోనా వ్యాక్సిన్ డోసులు ఎక్కువగా వృథా చేసిన రాష్ట్రాల్లో తమిళనాడు అగ్రస్థానంలో ఉందని తెలిపింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే కరోనా డోసుల వృథా జరుగుతోందని పేర్కొంది.

44 లక్షల కరోనా డోసులు వృథా.. జాబితాలో తెలంగాణ కూడా
ఏప్రిల్ 11 నాటికి రాష్ట్రాలన్నింటికీ 10 కోట్ల డోసుల టీకాలను కేటాయించగా.. ఇందులో 44 లక్షలకుపైగా డోసులు వృథా అయినట్లు వెల్లడైంది. తమిళనాడు రాష్ట్రంలో 12.10 శాతం, హర్యానాలో 9.74 శాతం, పంజాబ్ రాష్ట్రంలో 8.12 శాతం, మణిపూర్‌లో 7.8 శాతం, తెలంగాణలో 7.55 శాతం డోసులు నిరుపయోగమైనట్లు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో అధికారులు పేర్కొన్నారు. కేరళ, పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, గోవా, డామన్ డయ్యూ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లో ఈ వృథా తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.

కరోనా డోసుల వృథాపై కేంద్రం ప్రత్యేక దృష్టి.. రాష్ట్రాలకు అలర్ట్
కాగా, దేశంలో పలు రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా కావడం పట్ల ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్త చేసిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ వృథాపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం.. డోసుల వృథా కట్టడికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది.
స్టాక్‌ను సకాలంలో అందుబాటులో ఉంచుకోవాలని, టీకా వినియోగానికి సంబంధించి కొవిన్, ఈవిన్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించింది. గతంలో కరోనా వ్యాక్సిన్ డోసులు ఎక్కువగా వృథా చేసిన రాష్ట్రాల జాబితాలో ఉన్న ఏపీ, తెలంగాణలు ఇప్పుడు వృథాను అరికట్టునట్లు తెలుస్తోంది. కాగా, దేశంలో గత 24 గంటల్లో 2,59,170 కరోనా కేసులు నమోదు కాగా, 1761 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,53,21,089కి చేరింది. మరణాల సంఖ్య 1,80,530కి చేరింది. ప్రస్తుం దేశంలో 20,31,977 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications