SSY: నెలకు రూ.5 వేలతో మీ కుమార్తెకు రూ.27 లక్షలు బహుమతిగా ఇవ్వొచ్చు..!
ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే చాలా బాధపడే తల్లిదండ్రులు చాలా మందే ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే అని అనుకుంటున్నారు. అయితే అమ్మాయి అయితే వారి పెళ్లి ఎలా చేయాలని ఇప్పటికీ ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారు. వారు బాధపడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కేవలం బాలికలకు మాత్రమే. ఇందులో తక్కువ మొత్తాలతో పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో కచ్చితమైన రాబడి ఉంటుంది.
సుకన్య సమృద్ధి యోజన ఖాతా బ్యాంక్ లేదా పోస్టాఫీస్ లో ఓపెన్ చేయవచ్చు. మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇద్దరి పేరుతో ఈ ఖాతా తీసుకోవచ్చు. ఇద్దరి కంటే ఎక్కువ ఆడపిల్లలు ఉంటే ఇద్దరికి మాత్రమే సుకన్య సమృద్ధి యోజన ఖాత తెరవొచ్చు. ఇందులో కొన్ని షరతులు, నిబంధనలు ఉన్నాయి. మొదట ఆడ పిల్ల పుట్టి.. రెండో కాన్పులో ఇద్దరు ఆడపిల్లు(కవల పిల్లలు) జన్మస్తే అప్పుడు ముగ్గురు పేరుపై ఖాతా తీసుకునే అవకాశం ఉంది. సుకన్య సమృద్ధి యోజనలో సంవత్సరానికి కనిష్ఠంగా రూ.250 పెట్టుబడి పెట్టాలి.

గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. మీ కూతురికి 15 ఏళ్లు వచ్చే వరకు పెట్టుబడి పెట్టొచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకానికి ప్రభుత్వం 8.2 శాతం వడ్డీని చెల్లిస్తోంది. మీరు మీ కుమార్తె వయస్సు సంవత్సరం అయితే ఆమె పేరుపై నెలకు రూ.5 వేలు జమ చేస్తే మీ కూతురు 21 సంవత్సరాలు వచ్చేసరికి.. రూ.27,71,031 వస్తాయి. మీరు నెలకు రూ.10 వేల జమ చేస్తే రూ.55,42,062 వస్తాయి. మీరు పెట్టే పెట్టుబడి ఆధారంగా ఇందులో రాబడి ఉంటుంది. మీరు ఈ పథకంలో నెలకు రూ.12,500 చెల్లిస్తే మీకు రూ.69,27,578 వస్తాయి.
ఈ పథకంలో బాలికకు 15 ఏళ్లను దాటిన తర్వాత చదువు అవసరాలకు కొంతమేర విత్ డ్రా చేసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో సంవత్సరం కనీసం రూ.250 చెల్లించాలి. లేకుంటే ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది. ఇక సుకన్య సమృద్ధి యోజన ద్వారా పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.












Click it and Unblock the Notifications