ఇథనాల్ బంద్.. షుగర్ డైవర్షన్‌పై నిషేధం! నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ షురూ
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చక్కెర ఉత్పత్తి దేశమైన భారతదేశంలో వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం, దశాబ్దంలోనే అత్యంత బలహీనమైన రుతుపవనాల వల్ల చెరకు పంట గణనీయంగా దెబ్బతింది. దీంతో దేశంలో చక్కెర లభ్యత తగ్గి, ధరలు అదుపుతప్పే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో చక్కెర ధరలను నియంత్రణలో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. చెరకు నుంచి ఇథనాల్‌ను తయారు చేసే విధానానికి తాత్కాలికంగా అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
నవంబర్ 1 నుంచి అమల్లోకి నూతన నిబంధనలు
వచ్చే నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న నూతన ఇంధన సరఫరా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ రంగ రిఫైనరీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL), నుమాలిగఢ్ రిఫైనరీ, మంగళూరు రిఫైనరీ సంయుక్తంగా సుమారు 11 బిలియన్ లీటర్ల ఇథనాల్ కొనుగోలు కోసం ఒక టెండర్‌ను విడుదల చేశాయి. అయితే ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం.. ఈ టెండర్లలో చెరకు రసం, నేరుగా చక్కెర, షుగర్ సిరప్ అలాగే బి-హెవీ మొలాసిస్ నుంచి తయారు చేసే ఇథనాల్ కొనుగోళ్లకు ఎలాంటి చోటు కల్పించలేదని స్పష్టం చేశారు.

ఎల్‌నినో దెబ్బతో తగ్గిన పంట దిగుబడులు.. గ్లోబల్ మార్కెట్లోనూ భారం
ప్రపంచవ్యాప్తంగా చక్కెర ధరలు భగభగ మంటుండటానికి గతంలో ఎల్‌నినో ప్రభావం వల్ల దేశంలో ఎండలు తీవ్రమై చెరకు దిగుబడులు పడిపోవడమే ప్రధాన కారణం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పంట దిగుబడి చాలా తక్కువగా ఉండటంతో చక్కెర కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. గతంలో దిగుమతి చేసుకునే చమురుపై భారాన్ని తగ్గించుకోవడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం కల్పించే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అనుకున్న లక్ష్యాలకంటే ముందే 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించారు. అయితే ఇప్పుడు పంట దిగుబడులు తగ్గడంతో చక్కెరను ఇథనాల్ తయారీకి మళ్లించడాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.
ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్న ఇథనాల్ సప్లయర్లు
చెరకు ఆధారిత ఇథనాల్‌కు బ్రేక్ పడినప్పటికీ, తాజా టెండర్లలో పాల్గొనే సరఫరాదారులు ప్రత్యామ్నాయాల ద్వారా ఇథనాల్ అందించేందుకు అవకాశం కల్పించారు. సి-హెవీ మొలాసిస్, పాడైపోయిన ఆహార ధాన్యాలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వద్ద ఉన్న అదనపు బియ్యం, మొక్కజొన్న జాతీయ ఇంధన విధానం (National Policy on Biofuels) కింద అనుమతించిన ఇతర ముడి పదార్థాల నుంచి ఇథనాల్ తయారు చేసి అందించవచ్చని టెండర్ పత్రాల్లో స్పష్టం చేశారు. దీనివల్ల చక్కెర నిల్వలు సురక్షితంగా ఉండటంతో పాటు ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యాలు కూడా దెబ్బతినకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించారు.














Click it and Unblock the Notifications
