ఐఆర్‌సీటీసీపై కేంద్రం కొత్త నిర్ణయం: ప్రయాణికులకు..!!
IRCTC: ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌పై కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. కోట్లాదిమంది రైలు ప్రయాణికులకు టికెట్ బుకింగ్‌లో కీలక పాత్రను పోషిస్తోన్న ఈ సంస్థకు నవరత్న హోదా ఇచ్చింది. దీనితో పాటు- ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్‌కూ ఇదే స్టేటస్ కల్పించింది. ఈ రెండింటి చేరికతో దేశంలో ఇప్పుడున్న నవరత్న హోదా ఉన్న సంస్థల సంఖ్య 26కు చేరింది.
రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో కార్యకలాపాలు కొనసాగిస్తోన్నాయి ఈ రెండు సంస్థలు కూడా. సెంటర్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌గా గుర్తింపు ఉంది. ఇప్పుడు తాజాగా నవరత్న హోదా లభించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4,270.18 కోట్ల వార్షిక టర్నోవర్‌ను నమోదుచేసింది ఐఆర్‌సీటీసీ. 1,111.26 కోట్ల రూపాయల పన్ను చెల్లింపుల తరువాత నికర లాభం 3,229.97 కోట్ల రూపాయలు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 26,644 కోట్ల వార్షిక టర్నోవర్‌ను సాధించింది ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. 6,412 కోట్ల రూపాయల పన్నుల చెల్లింపుల తరువాత 49,178 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. నవరత్న హోదా ఈ రెండు కంపెనీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి దోహదం చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల అవసరం లేకుండానే 1,000 కోట్ల రూపాయల వరకు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెసలుబాటును కల్పిస్తుంది. ఈ 1,000 కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులతో తన పర్యాటక రంగ సేవలను మరింత విస్తరించుకోవడానికి ఐఆర్‌సీటీసీకి వీలు కలిగినట్టయింది.
ఈ రెండింటితో పాటు- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు నవరత్న హోదా ఉంది.
అలాగే- నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్ఎండీసీ, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఐఆర్కాన్, ఆర్‌ఐటీఈఎస్ నవరత్న హోదా ఉన్న కంపెనీల జాబితాలో ఉన్నాయి.
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్, మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ వంటి నవరత్న కంపెనీలు ఈ హోదాలో కార్యకలాపాలు కొనసాగిస్తోన్నాయి.












Click it and Unblock the Notifications