17 ఏళ్లకే పెళ్లి: తొలిసారి భార్య గురించి పేర్కొన్న మోడీ
అహ్మదాబాద్: వదోదర లోకసభ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేసిన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ... తనకు పదహేడవ ఏట పెళ్లైందని, అప్పుడు ఆమె వయస్సు తనతో సమానంగా ఉందని పేర్కొన్నారు. నామినేషన్ పత్రాల్లో మోడీ పెళ్లి వివరాలను కూడా ప్రస్తావించారు. తనకు పెళ్లైందని మోడీ చెప్పడం ఇది మొదటిసారి అంటున్నారు.
వదోదర నుండి లోకసభకు నామినేషన్ దాఖలు చేసిన మోడీ తన నామినేషన్ పత్రాల్లో... తన వైవాహిక స్థితిపై నిజాలను బయటపెట్టారు. 17 ఏళ్ల వయసులోనే తన వయసుకు సమానమైన బాలికను తాను వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. తన భార్యపేరు జశోదాబెన్ అని, ఆమె రిటైర్డ్ స్కూల్ టీచర్‌గా ఉన్నారని పేర్కొన్నారు.

మోడీ స్వగ్రామం వడ్నగర్‌కు 35 కిలోమీటర్ల దూరంలో గల బ్రహ్మనవాడలో జశోదాబెన్ ఉపాధ్యాయురాలిగా పని చేసి రిటైర్ అయ్యారు. మోడీ 2001, 2002, 2007, 2012 గుజరాత్ ఎన్నికల సమయంలో తన నామినేషన్ పత్రాల్లో వివాహం గురించి కాలంను ఖాళీగా వదిలి వేశారు.
ఈసారి మాత్రం ప్రత్యర్థి కాంగ్రెస్ నేతల నోటికి తాళం వేసే ఉద్దేశంతో తన పెళ్లి గురించిన వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. మోడీ పెళ్లి చేసుకుని భార్యతో ఎందుకు కలసి ఉండడం లేదంటూ లోగడ పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, పెళ్లయిన రెండు వారాలకే మోడీ తన ఆశయాల కోసం భార్యతో విడిపోయినట్లు సమాచారం.
ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రతీ అభ్యర్థి తన భార్య పేరిట ఉన్న ఆస్తులను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. కానీ, తన భార్య జశోదాబెన్‌కు ఉన్న ఆస్తుల వివరాలు తెలియవని మోడీ తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. మోడీ తన వైవాహిక స్థితిని నామినేషన్ పత్రాల్లో పేర్కొనకపోవడంపై సుప్రీం కోర్టులో 2012లొ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణకు కోర్టు నిరాకరించింది. 2012లో మోడీ మణినగర్ అసెంబ్లీ నుండి పోటీ చేశారు.












Click it and Unblock the Notifications