బీజేపీలో చేరిన హెయిర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్
ఢిల్లీ : ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని హెడ్ క్వార్టర్‌లో సోమవారం నేతలు పార్టీ కండువా కప్పి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జావెద్ హబీబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం తాను కేశాలకు మాత్రమే కాపలాదారుగా ఉన్నానని బీజేపీలో చేరికతో ఇప్పుడు దేశానికి చౌకీదార్‌గా ప్రమోషన్ లభించిందని ఆనందం వ్యక్తం చేశారు.
మోడీ పనితీరుపై జావెద్ ప్రశంసలు గుప్పించారు. ఆయన అమలు చేస్తున్న సంస్కరణలు దేశాన్ని అభివృద్ధిపథంలో నడుపుతున్నాయని అన్నారు. తాను ఛాయ్‌వాలా అని ప్రధాని గర్వంగా చెప్పుకుంటారని, ఆయనలాగే తాను బార్బర్ అని చెప్పుకునేందుకు ఏ మాత్రం సిగ్గుపడనని స్పష్టం చేశారు.

ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అయిన జావెద్ హబీబ్‌కు దేశ విదేశాల్లో మంచి పేరుంది. సెలబ్రిటీలు ఆయన అపాయింట్‌మెంట్ కోసం క్యూ కడుతుంటారు. దేశవ్యాప్తంగా ఆయనకు 550 వరకు చెయిన్ హెయిర్ సెలూన్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications