ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టిన గూడ్స్: 5 మంది మృతి: కేంద్రం దిగ్భ్రాంతి
Kanchenjunga Express: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. పలు బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. చెల్లా చెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు అయిదుమంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్య చికిత్సను అందజేస్తోన్నారు. బోగీల్లో చిక్కుకున్న వారిని వెలికి తీస్తోన్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

అస్సాంలోని సిల్చార్ నుంచి పశ్చిమ బెంగాల్‌లో సియాల్దాకు బయలుదేరిన నంబర్ 13174 కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ న్యూజల్‌పాయ్‌గురి జిల్లా సిలిగురి డివిజన్ పరిధిలోని రైధాసా- రంగపణి స్టేషన్ల మధ్య ఫన్సీ దేవా వద్ద ఈ ఉదయం ప్రమాదానికి గురైంది. గూడ్స్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కొన్ని బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. గూడ్స్ రైలులో ఉన్న కంటైనర్లు చెల్లాచెదురుగా పడ్డాయి.
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బలగాలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు, రైల్వే శాఖ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న వారిని వెలికి తీస్తోన్నారు. క్షతగాత్రుల హాహాకారాలు, చెల్లా చెదురుగా పడ్డ బోగీలతో సంఘటన స్థలం భీతావహంగా మారింది.
Unfortunate accident in NFR zone. Rescue operations going on at war footing. Railways, NDRF and SDRF are working in close coordination. Injured are being shifted to the hospital. Senior officials have reached site.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 17, 2024
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి మమత బెనర్జీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రాణాపాయాన్ని నివారించడానికి అన్ని వనరులను వినియోగిస్తోన్నట్లు తెలిపారు. డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది, మందులను సంఘటన స్థలానికి తరలించినట్లు వెల్లడించారు. అంబులెన్సులను అందుబాటులో ఉంచామని చెప్పారు.
ప్రయాణికుల కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రుల కోసం సిలిగురి డివిజన్‌లోని పలు రైల్వే స్టేషన్లల్లో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. సియాల్దా స్టేషన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నంబర్ 033-23508794, 033-23833326. అస్సాంలోని గువాహటి స్టేషన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నంబర్ 036-12731621.












Click it and Unblock the Notifications