Kangana vs Ramdev: "నా బెడ్ రూమ్ లో గబ్బిలంలా రాందేవ్..? ఏం చూశారన్న కంగనా..!
బీజేపీకి సన్నిహితంగా ఉండే పతంజలి ఆయుర్వేద సంస్థ అధినేత బాబా రాందేవ్ (Baba Ramdev) కూ, ఆ పార్టీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) కూ మధ్య మాటల యుద్దం మరింత తీవ్రమైంది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం సందర్భంగా విద్యార్ధుల్ని జనరేషన్ గట్టర్ (ఈ తరం మురికి) అంటూ కంగన నోరు పారేసుకోవడం, దీన్ని బాబా రాందేవ్ తప్పుబడుతూ తన గతం ఏంటో గుర్తుచేసుకోవాలని సలహా ఇవ్వడం, దీంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఆయుర్వేద ఉత్పత్తులపై సుప్రీంకోర్టుతో చీవాట్లు తిన్నారుగా అంటూ కంగన విమర్శించడం, దీనికి కొనసాగింపుగా ఆమె గతం, యవ్వనంపై రాందేవ్ చేస్తున్న వ్యాఖ్యలు ఇవాళ మరో మలుపు తిరిగాయి.
కంగన గురించి బాబా రాందేవ్ తాజాగా స్పందిస్తూ.. వారి అర్హతలు ఏమిటి? వారి బాల్యం ఎలా గడుస్తోంది? వారి యవ్వనం ఎలా ఉంది? వారి గతం ఎలా ఉంది? నేను అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడాలనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై కంగన స్పందిస్తూ.. నా యవ్వనంలో నన్ను చూశారా? ఆయన ఏం చూశారని కంగన ప్రశ్నించారు. ఆయన సరిగ్గా ఏం చూశారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఆయన ఏం చూశారో చెప్పాలన్నారు. ఇప్పటికే ఓసారి ఇన్ స్టా లోనూ ఇలాగే స్పందిస్తూ.. తన యవ్వనం లేదా పడకగది గురించి పగటి కలలు కనవద్దని రామ్‌దేవ్‌కు సలహా ఇచ్చారు.

సనాతన సిద్ధాంతాన్ని అనుసరించే రామ్‌దేవ్, చివరికి మిమ్మల్ని ఎలా వ్యతిరేకిస్తున్నారని డీడీ న్యూస్ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. ఆయన వ్యాపార ప్రయోజనాలే ఆయన్ను సనాతన తత్వ సూత్రాల నుండి దూరం చేశాయని తాను నమ్ముతున్నట్లు కంగనా తెలిపారు. అలాగే తన గతం, యవ్వనం గురించి రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడి చేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి ఆయన తన పడకగదిలో గబ్బిలంలా వేలాడుతున్నారా అని ప్రశ్నించారు. ఆయన స్వదేశీ ఉద్యమం ప్రారంభమైనప్పుడు, ప్రభుత్వం కూడా ఆయన్ను చాలా ప్రోత్సహించిందని, కానీ ఆయన పెట్టుబడిదారీ విధానంలోకి మరీ ఎక్కువగా వెళ్లిపోయారని తాను భావిస్తున్నట్లు కంగనా తెలిపారు. అలాగే ప్రజల నుండి ఎంత దోచుకుంటున్నారు అనే విషయంలో సనాతన సిద్ధాంతం, పెట్టుబడిదారీ విధానం మధ్య చివరికి సంఘర్షణ తలెత్తవచ్చని కూడా స్పష్టం చేశారు. ఆయుర్వేదం, మూలికలు, యోగాకు లభించిన ప్రోత్సాహం నుండి, ఆయన ఇప్పుడు బనియన్లు, లోదుస్తులు అమ్మే వ్యాపారాల వైపు మళ్లారంటూ చురకలు అంటించారు.













Click it and Unblock the Notifications