పైన స్టార్ హీరోయిన్ ముసుగు.. లోన: లగ్జరీ ఇల్లే కేంద్రంగా
Ranya Rao: ప్రముఖ కన్నడ నటి రన్యా రావు అరెస్ట్ అయ్యారు. బంగారం స్మగ్లింగ్ కేసులో ఆమెను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని బరువు 14.8 కేజీలు. భారత్ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద రన్యా రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎవరీ రన్యా రావు
కన్నడం, తమిళ సినిమాల్లో నటించారు రన్యా రావు. 2014లో కిచ్చ సుదీప్ హీరోగా వచ్చిన మాణిక్య సినిమాతో శాండల్‌వుడ్‌లో అడుగు పెట్టారు. తెలుగు మూవీ మిర్చికి ఇది రీమేక్. తమిళంలో వాఘా మూవీలో నటించారు. విక్రమ్ ఫ్రభు ఇందులో హీరో. గోల్డెన్ స్టార్ గణేష్ సరసన పటాకిలో మెరిశారు. కల్యాణ్ రామ్ నటించిన పటాస్‌కు రీమేక్ మూవీ ఇది.
తండ్రి ఐపీఎస్..
రన్యా రావు స్వస్థలం.. చిక్‌మగళూరు. అసలు పేరు హర్షవర్ధిని యజ్ఞేష్. తండ్రి కర్ణాటక క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్‌లో కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేస్తోన్నారు. తండ్రి ఉద్యోగరీత్యా చిన్నప్పుడే బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. ఆమె విద్యాభ్యాసం మొత్తం ఇక్కడే సాగింది.
దుబాయ్‌కు చక్కర్లు..
కొంతకాలంగా రన్యా రావ్ దుబాయ్‌కు రాకపోకలు సాగిస్తూ వస్తోన్నారు. ఈ క్రమంలో ఈ ఉదయం ఆమె దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ఉత్త చేతులతో కాదు.. 14.8 కేజీల బంగారాన్ని ఆమె తన వెంట తెచ్చుకున్నారు. 14 కేజీలు, 800 గ్రాముల బరువు ఉండే 15 బంగారం బిస్కెట్లను గమ్‌తో తొడలకు అంటించి మరీ బెంగళూరుకు వచ్చారు.
ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీ..
బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీల సందర్భంగా ఆమె గుట్టు రట్టయింది. స్కానర్లల్లో పట్టుబడకుండా ఉండటానికి క్రేప్ బ్యాండేజ్ అంటించుకున్నారు. ఆమె బంగారం స్మగ్లింగ్ చేస్తోన్నట్లు డీఆర్ఐ అధికారులకు ముందుగానే సమాచారం అందడం వల్ల తనిఖీ చేశారు.

ఇంత భారీ ఎత్తున బంగారం లభించిన తరువాత డీఆర్ఐ సిబ్బంది, పోలీసులు- బెంగళూరు లావెల్లె రోడ్‌లో గల ఆమె ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన మరో రెండున్నర కేజీల విలువ చేసే బంగారం బిస్కెట్లు వెలుగులోకి వచ్చాయి. వీటి విలువ 13 కోట్ల రూపాయలుగా తేలింది.












Click it and Unblock the Notifications