రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా- ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ట్రావెల్
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో కీలకమైనది- ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. శక్తి పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. లగ్జరీ, ఏసీ బస్సులు మినహా- మిగిలిన అన్నింట్లోనూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
బెంగళూరు సిటీ బస్సులతో పాటు కేఎస్ఆర్టీసీ, ఈశాన్య ఆర్టీసీ, వాయవ్య ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది. ఈ పథకం ఇవ్వాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. బెంగళూరులో విధానసౌధ వద్ద ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు దీన్ని సిద్ధరామయ్య.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో కలిసి ప్రారంభించారు.

సిద్ధరామయ్య స్వయంగా మహిళా ప్రయాణికులకు ఫ్రీ పాసులను జారీ చేశారు. దీనికోసం కండక్టర్ అవతారం ఎత్తారు. అలాగే- శక్తి పథకం లోగోను ఆవిష్కరించారు. కర్ణాటకలో ఏ మూల నుంచి ఏ మూలకైనా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. జీరో టికెట్ ధర. ఒక్క రూపాయి కూడా వారి నుంచి వసూలు చేయరు. ప్రయాణ సమయంలో ఆధార్ కార్డ్, ఓటరు కార్డు లేదా తాము కర్ణాటకలో నివసిస్తోన్నట్లు రుజువు చేసే ఇతర ఏ గుర్తింపు కార్డునయినా కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది.
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌డబ్ల్యూ ఆర్టీసీ), కళ్యాణ కర్ణాటక/నార్త్ ఈస్ట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఈశాన్య ఆర్టీసీ) బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. అన్ని ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. విద్యార్థినులకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుంది.
ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారు సరిహద్దుల్లో ఉన్న స్టేజీ నుంచి గమ్యస్థానానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రాజహంస, వజ్ర, వాయు వజ్ర, ఐరావత, ఐరావత క్లబ్ క్లాస్, ఐరావత గోల్డ్ క్లాస్, అంబారీ, అంబారీ డ్రమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్, ఎఫ్‌టి బస్, ఈవీ పవర్ ప్లస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చిన బస్సుల్లో 50 సీట్లను పురుషుల కోసం రిజర్వ్ చేశారు.












Click it and Unblock the Notifications