దారుణం.. అత్తను కడతేర్చిన కోడలు, అద్దెకుండే ప్రేమికుడు!
సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోతోంది. కొన్ని నిమిషాల సుఖం కోసం నిండు ప్రాణాలను బలి చేస్తున్నారు. అడ్డొస్తే వారి ఎవరూ అనేది చూడకుండా కిరాతకంగా హత్యలు చేస్తూ సభ్యసమాజాన్ని బ్రష్టుపట్టిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సభ్యసమాజం తలదించుకునేలా ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తుందనే కోపంతో ఓ మహిళ తన ప్రేమికుడితో కలిసి సొంత అత్తనే దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన లక్నోలోని నిషాత్‌గంజ్ ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే?
నిషాత్‌గంజ్ కు చెందిన 69 ఏళ్ల నిర్మలా దేవి, తన కుమారుడు త్రిదేశ్, కోడలు రంజన, ముగ్గురు మనవళ్లతో కలిసి నివసిస్తోంది. వారి రెండస్తుల ఇంట్లో పై అంతస్తును రాజన్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. ఈ క్రమంలో రంజనకు, అద్దెకు ఉంటున్న రాజన్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. త్రిదేశ్ పని కోసం ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత రంజన, రాజన్ ఇద్దరూ ఏకాంతంగా గడిపేవారు. దీనిని గమనించిన అత్త నిర్మలా దేవి పలుమార్లు వారిని నిలదీసింది. కొడుకు పక్షాన నిలబడి కోడలిని మందలించడంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.

హత్య జరిగిందిలా..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ హత్యకు మూడు రోజుల ముందు అత్తాకోడళ్ల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో విసిగిపోయిన అత్త.. ఇకపై తాను విడిగా వంట చేసుకుంటానని తెగేసి చెప్పింది. ఆమె తమ సంబంధానికి అడ్డు పడుతుందని భావించిన కోడలు రంజన.. నిర్మలాదేవిని ఎలాగైనా వదలించుకోవాలని ప్రియుడు రాజన్‌తో కలిసి ప్లాన్ చేసింది. శనివారం మధ్యాహ్నం త్రిదేశ్ ఆఫీస్‌కు వెళ్లిన సమయంలో వారు నిర్మలా దేవి చేతులు, కాళ్లు కట్టేసి చీరతో గొంతు నులిమి హత్య చేశారు. పోలీసులు దర్యాప్తు చేయకుండా ఉండేందుకు ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను కాసేపు నిలిపివేశారు. అలాగే హత్యను దొంగతనంగా చిత్రీకరించేందుకు ఆమె ఇంటిపై ఉన్న నగలను కూడా దొంగిలించి దాచారు.
నిజం బయటపడిందిలా..
నిర్మలా దేవి మనవడు ఆదిత్య మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఆమె విగతజీవిగా పడి ఉండటం చూసి తండ్రికి ఫోన్ చేశాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఫోరెన్సిక్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేపట్టారు. స్నిఫర్ డాగ్ నేరుగా అద్దెకు ఉంటున్న రాజన్ వైపు వెళ్లడంతో పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు రంజన, రాజన్ ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.












Click it and Unblock the Notifications