క్వార్టర్ కొనాలంట.. 90ML పోయరంట
వారంతా ఎండల్లో, వానల్లో ఒళ్లు అలసిపోయేలా కష్టపడతారు. ఆ కష్టం నుంచి ఉపశమనం పొందేందుకు రెండు పెగ్గులు మందు కొడతారు. తమ దగ్గర ఉన్న డబ్బులను బట్టి కొందరు ఎక్కువ తాగుతుంటారు. మరికొందరు తక్కువగా తాగుతుంటారు. ఫుల్ బాటిల్ లాగించేవాళ్లు కూడా ఉన్నారు. అయితే తాను 90 ఎంఎల్ తాగాలనుకున్నానని, కానీ షాపువాళ్లు పోయలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తెలంగాణలోని జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్ గ్రామంలోని బెల్ట్ షాపు నిర్వాహకుడు మద్యం పోయడం లేదని అదే గ్రామానికి చెందిన చిరంజీవి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హబ్సీపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి తమ గ్రామంలో ఉన్న బెల్టు షాపుకు వెళ్లాడు. అక్కడ 90 ఎంఎల్ మద్యం పోయాలని కోరాడు. బెల్టు షాపు నిర్వహిస్తున్నతను నిరాకరించాడు. క్వార్టర్ బాటిల్ ఇస్తానని, 90 ఎంఎల్ మాత్రం పోయనని ఖరాఖండిగా తేల్చేశాడు. దీంతో ఆ వ్యక్తి తనను కులం పేరుతో దూషించాడంటూ ఫిర్యాదు చేశాడు. అంతేకాదు మద్యం పోయకుండా తనను అవమానించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. గతంలో ఈ బెల్టు షాపులోనే కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఘటనలున్నాయి.

జగిత్యాల జిల్లా వైన్ షాపు యజమానులంతా కలిసి సిండికేట్ గా మారారని, వారు కింగ్ ఫిషర్ బీర్లుఅమ్మడం లేదని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు అందింది. దీనిపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఎక్సైజ్ అధికారులు వైన్ షాపు యజమానులతో మాట్లాడి ఆ బీర్ల అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనతో మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా చిరంజీవి అనే వ్యక్తి 90 ఎంఎల్ అమ్మడంలేదంటూ ఫిర్యాదు చేయడంతో ఈసారి పోలీసులు ఏంచేస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications