ఆ పేమెంట్ యాప్ వాడుతున్నారా?: బీ అలర్ట్: 35 లక్షల మంది యూజర్ల కేవైసీ డేటా లీక్: డార్క్‌వెబ్
న్యూఢిల్లీ: డిజిటల్ ట్రాన్సాక్షన్స్.. ఆన్‌లైన్ పేమెంట్స్..మొబైల్ యాప్ ద్వారా చెల్లింపులు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్న ఆర్థిక కార్యకలాపాలివే. పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌కు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇవ్వడం, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏటీఎంలకు వెళ్లి నగదును డ్రా చేసుకోవడానికి ఖాతాదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం వంటి కారణాల వల్ల ఆన్‌లైన్, మొబైల్ యాప్‌ల ద్వారా చెల్లింపులు విస్తృతంగా కొనసాగుతున్నాయి. అవన్నీ ఎంతమేర సురక్షితమనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమౌతోంది.
ప్రముఖ పేమెంట్ యాప్ మొబిక్విక్ (Mobikwik)ను వినియోగిస్తోన్న వారిలో సుమారు 35 లక్షలమందికి సంబంధించిన వ్యక్తిగత వివరాలన్నీ లీక్ అయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కేవైసీ డేటా బ్రీచ్‌గా దీన్ని భావిస్తున్నారు. ఆధార్ కార్డు, పాన్, ఫోన్ నంబర్లు, ఐపీ అడ్రస్, జీపీఎస్ లొకేషన్ల డేటా కూడా ఇందులో లీక్ అయినట్లు చెబుతున్నారు. ఒక్కో యూజర్‌కు సంబంధించిన కేవైసీ డేటా వివరాలు, వ్యక్తిగత సమాచారం విలువ 86 వేల డాలర్లు ఉండొచ్చంటూ వార్తలొస్తున్నాయి. దీనిపట్ల ఆ కంపెనీ యాజమాన్యం స్పందించింది. యూజర్ల డేటా లీక్ కాలేదంటూ తెలిపింది.

ఈ సమాచారాన్ని తొలుత రాజశేఖర్ రాజహరియా అనే ఓ సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ వెల్లడించాడు. కొందరు యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో కూడిన కేవైసీ స్క్రీన్‌షాట్లను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మొత్తం 350 గిగా బైట్స్ సామర్థ్యం కలిగిన డేటాతో పాటు ఆరు టెర్రాబైట్స్ మేర విలువైన కేవైసీ డేటా లీక్ అయినట్లు పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని ఇలియట్ ఆండర్సన్ అనే మరో రీసెర్చర్ ధృవీకరించారు. చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్‌గా ఆయన దీన్ని అభివర్ణించారు.
దీనిపై టెక్‌నాడు ఓ ప్రత్యక కథనాన్ని ప్రచురించింది. యూజర్ల ఇమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు, యాప్ పాస్‌వర్డ్స్, ఫోన్ తయారీదారుడు, ఐపీ అడ్రస్, జీపీఎస్ లొకేషన్ వంటి వివరాలన్నీ బహిర్గతమైనట్లు పేర్కొంది. ఎవరైనా తమ ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ ద్వారా వివరాలను చెక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ వార్తలను మొబిక్విక్ యాజమాన్యం తోసిపుచ్చింది. కొందరు సెక్యూరిటీ రీసెర్చర్లు ఉద్దేశపూరకంగా డేటా లీకేజీ వార్తలను సృష్టించారని తెలిపింది. ప్రతి యూజర్ డేటా సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది. ఈ వార్తలను విశ్వసించొద్దని విజ్ఙప్తి చేసింది.












Click it and Unblock the Notifications