ముంబైలో ఘోర ప్రమాదం : కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం- 9 మంది మృతి
ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం(జూన్ 9) ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మాల్వని ప్రాంతంలో ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా.. మరో 8 మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాత్రి 11.10గం. ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సమాచారం అందినవెంటనే స్థానిక ఫైర్ సిబ్బంది,పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న 15 మందిని రక్షించగలిగారు. క్షతగాత్రులను బీడీబీఏ జనరల్ ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా చాలామందే ఉండొచ్చునని భావిస్తున్నారు.

ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలే భవనం కుప్పకూలడానికి కారణమని మంత్రి అస్లమ్ షేక్ పేర్కొన్నారు.
ముందు జాగ్రత్తగా సమీపంలోని మరో మూడు భవనాలను కూడా ఖాళీ చేయించినట్లు బృహన్ ముంబై కార్పోరేషన్ వెల్లడించింది. ఆ మూడు భవనాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయని... వర్షాల ప్రభావానికి కుప్పకూలే ప్రమాదం ఉండటంతో ఖాళీ చేయించినట్లు తెలిపింది.
రెండు రోజుల క్రితం బాంద్రా ప్రాంతంలోని ఖేర్వాడి రోడ్‌లోనూ ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.శిథిలాల కింద చిక్కుకున్న 17 మందిని రక్షించగలిగారు.
నైరుతి రుతుపవనాల ఆగమనంతో ప్రస్తుతం ముంబైలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం(జూన్ 9) ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరం చివురాటకులా వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబైతో పాటు నగరాన్ని ఆనుకుని ఉన్న చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. చాలాచోట్ల మోకాళ్ల లోతు నీళ్లతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైల్వే ట్రాక్ సైతం నీటమునగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Recommended Video
ముంబైలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు ఉంటాయని.. రాబోయే 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రతీ ఏటా వానా కాలంలో ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతూనే ఉన్నాయి. వర్షం కురిసిందంటే చాలు నగరం పూర్తిగా జలమయం అవుతున్న పరిస్థితి.












Click it and Unblock the Notifications